
– ఘనంగా అరసం “విమర్శ – పాఠశాల” ప్రారంభం
అనంతపురము, ఆగష్టు 8, జనస్వరం : ఆధునిక కాలంలో శాస్త్రస్థాయికి ఎదుగుతున్న సాహిత్య విమర్శ కూడా విమర్శకు గురికావాలని కేంద్ర సాహిత్యఅకాడమీ అవార్డుగ్రహీత, ఏపీ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులు, సుప్రసిద్ధ సాహితీ విమర్శకులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో “సాహిత్య విమర్శ: పాఠశాల” శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఆర్డీటి ఎకాలజీ సెంటర్లో రెండురోజుల పాటు జరగనున్న తరగతుల ప్రారంభ సభకు, అరసం జిల్లా అధ్యక్షులు భీమిరెడ్డి ఈశ్వరరెడ్డి అధ్యక్షత వహించారు. తొలుత విద్యార్థులు పేర్ల నమోదు చేసుకుని, తర్వాత పరస్పర పరిచయం చేసుకున్నారు. ముఖ్య అతిధిగా అరసం రాష్ట్ర కార్యదర్శి శరత్ చంద్ర జ్యోతిశ్రీ, ఆత్మీయ అతిథిగా అరసం సామాజిక మాధ్యమాల నిర్వహణ కార్యదర్శి ఏఎంఆర్ ఆనంద్ హాజరయ్యారు. ప్రముఖ సాహితీ విమర్శకులు, అరసం రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి అవగాహనా ప్రసంగం చేశారు. గేట్స్ ఇంజినీరింగ్ కళాశాల కరస్పాండెంట్ డా. వికె పద్మావతి, మీనాక్షమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రమాకాంత్ రమణ సభలో తమ సందేశమిచ్చారు. అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి డా. తన్నీరు నాగేంద్ర సభకు ఆహ్వానం పలికి, చక్కగా నిర్వహించారు. మొదటి తరగతిలో విశ్రాంత అధ్యాపకులు, సాహితీ విమర్శకులు డా. కె నాగేశ్వరాచారి సాహిత్య విమర్శ, నిర్వచనం, ప్రయోజనం అనే అంశంపై మాట్లాడారు. రెండవ తరగతిలో ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి “తెలుగు సాహిత్య విమర్శ పుట్టుక- వికాసం” గురించి వివరించారు. మూడవ తరగతిలో డా. కె నాగేశ్వరాచారి “సాహిత్య విమర్శకులు- అర్హతలు, బాధ్యతలు” గురించి విపులంగా ప్రసంగించారు. చివరిగా విద్యార్థులు – ఉపాధ్యాయులు సంభాషణ అర్థవంతంగా సాగింది. ఈ సందర్భంగా ఆచార్య రాచపాలెం మాట్లాడుతూ, సమాజం – సాహిత్యం – సాహిత్య విమర్శ మధ్య విడదీయరాని సంబంధం ఉందన్నారు. సాహిత్యానికి జన్మస్థానం గమ్యస్థానం సమాజమే అని రారా అన్నారని, సాహిత్య విమర్శకు కూడా జన్మస్థానం గమ్యస్థానం సమాజమే అని రాచపాళెం అన్నారు. సాహిత్యంలోనూ, సమాజంలోనూ విమర్శ అనేది ఒక ప్రజాస్వామిక ప్రక్రియ అన్నారు. సాహిత్య విమర్శ ఎంతో గొప్పదని ఆచార్య రాచపాలెం అభిప్రాయపడ్డారు. తెలుగులో సాహిత్య విమర్శ నిరంతరం ఎదుగుతూ, జాగరూకతతో ఉందన్నారు. పరిణామక్రమంలో విమర్శ కూడా శాస్త్ర స్థాయికి చేరుకుంటూ ఉందన్నారు. సాహిత్య విమర్శ భారతీయ భాషల్లో ఆధునిక ప్రక్రియ అన్నారు. ప్రాచీన కాలంలో ప్రత్యేక ప్రక్రియగా లేకపోయినా, విమర్శ అవసరాన్ని తిక్కన గుర్తించారని తెలిపారు. సాహిత్య విమర్శను సంప్రదాయ, ఆధునిక విమర్శగా రెండురకాలుగా విభజించుకోవచ్చన్నారు. అనేక పత్రికలు సాహిత్య విమర్శను ఎంతగానో ప్రోత్సహించాయన్నారు. కట్టమంచి రామలింగారెడ్డి రాసిన “కవిత్వతత్వ విచారం” గ్రంథం ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకు పరిణతరూపమన్నారు. సామాజిక, సాహిత్య చరిత్రలు కలిసి పయనిస్తాయని కట్టమంచి రాశాడన్నారు. కవిత్వంలో వస్తువు, శిల్పం రెండూ ముఖ్యమని, పాత్రలు సహజంగా ఉండాలని చెప్పారు. పింగళి సూరన తర్వాత, ఆధునిక సాహిత్య విమర్శకు గొప్ప ప్రేరణ వేమన అని రాచపాలెం అన్నారు. ప్రాచీన తెలుగు కవిత్వంలో శిల్పరహస్యాలను విశ్వనాథ సత్యనారాయణ విశ్లేషించారన్నారు. అభ్యుదయ కవిత్వం మొదలైనప్పుడే, అభ్యుదయ సాహిత్య విమర్శ మొదలైందన్నారు. తెలుగు సాహిత్య విమర్శ సంఘర్షిస్తూ ముందుకు సాగిందన్నారు. విమర్శ ప్రగతి సోపానమని, 1950 తర్వాత గొప్ప సాహిత్య విమర్శ వచ్చిందని, అనేక సిద్ధాంత గ్రంథాలు వచ్చాయని వివరించారు. తెలుగు సాహిత్య విమర్శ ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి దోహదం చేసిన సంఘటనలు కొన్ని ఉన్నాయన్నారు. గురజాడ, చలం, జాషువా శతజయంతుల సందర్భంగా చర్చలు, సదస్సులతో విమర్శ మరింత మెరుగుపడిందన్నారు. 1990 తర్వాత సాహిత్య విమర్శలో మూల్యాంకనం, పునర్మూల్యాంకనం ప్రస్తావనకు వచ్చాయన్నారు. సామాజిక సందర్భం మారినప్పుడు సాహిత్య సూత్రాలు కూడా మారతాయన్నారు. సాహిత్య విమర్శకు గొప్ప సూత్రాలనందించిన రాచమల్లు రామచంద్రారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు ఈ ప్రక్రియకు రెండు స్తంభాల్లాంటి వారన్నారు. మార్క్సిస్టులు భౌతిక వాదులని, కుల వ్యతిరేకులని రాచపాలెం చెప్పారు. స్త్రీవాదం వచ్చాక పాత సాహిత్యాన్ని మూల్యాంకనంతో పాటు, పునర్మూల్యాంకనం చేసిందన్నారు. కారంచేడు, చుండూరు ఘటనల నేపథ్యంలో దళితవాదం మొదలై, అంబేద్కర్, జాషువా శతజయంతుల సందర్భంలో మరింత విస్తృతమైందన్నారు. బాబ్రీ మసీదు విధ్వంసం నేపథ్యంలో అభద్రతాభావంతో ముస్లింవాదం మొదలైందన్నారు. గిరిజన సాహిత్య విమర్శ కూడా గొప్పగా వస్తున్నదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సందర్భంగా, ప్రాంతీయ అస్తిత్వవాద సాహిత్యం, విమర్శ బలం పుంజుకున్నా యన్నారు. కొడవటిగంటి కుటుంబరావు చెప్పినట్లు విమర్శ మీద కూడా విమర్శ ఎక్కువగా రావాలన్నారు. సాహిత్యం సమాజ జీవితాన్ని వ్యాఖ్యానిస్తే, విమర్శ సాహిత్య జీవితాన్ని విశ్లేషిస్తుందన్నారు. కారా మాష్టారి “యజ్ఞం” 35 పేజీల కథమీద 500 పేజీల విమర్శ రావడం, తుమ్మేటి “పనిపిల్ల” కథలమీద 100 మంది విమర్శకులు మాట్లాడడం, గురజాడ “దేశభక్తి” కవిత మీద 30 కి పైగా వ్యాసాలు రావడం, ఇనాక్ “ఊరబావి” కథమీదనే 30 వ్యాసాలు రావడం వంటివి తెలుగు సాహిత్య విమర్శలో అద్భుతాలన్నారు. అల్లసాని పెద్దన వాడిన “ఇనుపకచ్చడాల్” అనే ఒక్కమాట మీద తాపీ ధర్మారావు, “కపిత్థాకార భూగోళ” అనే గురజాడ వాడిన ఒక మాట మీద శిష్ట్లా, శ్రీనివాస్ చెరో పుస్తకం రాశారన్నారు. కన్యాశుల్కం నాటకంలో గిరీశం “భారతదేశం పతనానికి పదకొండు కారణాల” మీద బళ్ళారి రాఘవ 1935 లో ఒక ప్రసంగమే చేశారన్నారు. తెలుగు సాహిత్య విమర్శ ఎదుగుదల మీద రచయితల అసంతృప్తులు పూర్తీగా ఆమోదనీయాలు కాదన్నారు. అయినా ఆ అసంతృప్తులు నిరాధారాలు కాదని అభిప్రాయపడ్డారు. చేరా, త్రిపురనేని వంటివారు ఆ అసంతృప్తులకు సమాధానం చెప్పారని గుర్తుచేశారు. 1829లో సిపి బ్రౌన్, కావాలి రామస్వామి ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకు పునాది వేశారన్నారు. 1914 నాటి “కవిత్వతత్వ విచారం”తో తెలుగు సాహిత్య విమర్శ సంపూర్ణ ఆధునిక ప్రక్రియగా రూపుదిద్దుకుందన్నారు. “కవిత్వతత్వవిచారం” రాకతో ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ సంప్రదాయ, ఆధునికతగా రెండు పాయలుగా చీలిందన్నారు. ఆధునిక విమర్శలో అనేక విభాగాలేర్పడ్డాయన్నారు. ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకు ఇద్దరు ప్రాచీన తెలుగు కవులు ఆధారం కావడం విశేషమన్నారు. పింగళి సూరన, వేమన, వాళ్ల తర్వాత గురజాడ కారణంగా ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ అభివృద్ధి చెందిందన్నారు. ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ మూల్యాంకనం , పునర్ మూల్యాంకనం అనే రెండు కర్తవ్యాలు నిర్వహిస్తున్నదన్నారు. 1950 దాకా తెలుగు సాహిత్య విమర్శ మీద ప్రధానంగా అలంకారశాస్త్ర ప్రభావం ఎక్కువగా వుండేదని, ఆ తర్వాత మార్క్సిజం ప్రభావం ఎక్కువయిందన్నారు. 1899 ప్రాంతంలోనే వెళ్ళేది రామచంద్ర రావు లోకములో కావ్యం విమర్శను కడు నిష్టురపు పని అన్నారని గుర్తుచేశారు. అప్పటికే సాహిత్య లోకంలో విమర్శను సహించలేనితనం మొదలైందన్నారు. తెలుగులో సాహిత్యం మీద విమర్శ వచ్చినట్లుగా, విమర్శ మీద విమర్శ అంతగా రావడం లేదన్నారు. ఎస్వీ రామారావు, సంపత్కుమారాచార్య, యాకుబ్ వంటి కొందరే దాని జోలికి వెళ్ళారని రాచపాలెం వివరించారు.








