గురువులకు అండగా నిలబడదాం : గొర్తి వెంకటస్వామి

మన జీవితంలో ఉన్నత స్థానం గురువుకు ఇస్తాం. మనల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో గురువు కృషి వెలకట్టలేనిది. అటువంటి గొప్ప వ్యక్తులను స్మరించుకుంటూ మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 5న భారతదేశంలో టీచర్స్ డే జరుపుకుంటున్నాం. అదే విధంగా ప్రతి ఏటా అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయుల హోదా, హక్కులు, బాధ్యతలకు సంబంధించి 1966లో పారిస్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ‘స్టేటస్ ఆఫ్ ది టీచర్స్’ పత్రాన్ని ఆమోదించారు. 1994 నుంచి ఈ దినోత్సవాన్ని 100కు పైగా దేశాల్లో నిర్వహిస్తున్నారు. “ఉపాధ్యాయులతో నిలబడటం: 60 సంవత్సరాల వృత్తిని రక్షించడం, దాని స్థితిని అభివృద్ధి చేయడం మరియు మన భవిష్యత్తును రూపొందించడం” అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1966లో ఉపాధ్యాయుల స్థితిగతులపై చేసిన ఐఎల్‌ఓ/యునెస్కో సిఫార్సులకు 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఇతివృత్తాన్ని నిర్ణయించారు.

ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విద్యా విధానం సాంప్రదాయ బోధన నుంచి సాంకేతిక, నైపుణ్య, ప్రొఫెషనల్, వర్చువల్ విద్య వైపు మారింది. కరోనా సమయంలో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మూతపడినా ఉపాధ్యాయుల అంకితభావం, ధైర్యం అస్థిరపడలేదు. కోవిడ్ అనంతరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థుల స్థితిగతుల్లో మార్పు తీసుకురావడానికి విశేష కృషి చేశారు. యునెస్కో ఇచ్చిన నినాదానికి అనుగుణంగా పాలక వర్గాలు ఉపాధ్యాయ సిబ్బందిని గౌరవించాలి. సాంకేతిక పరిజ్ఞానం బోధనలో ఒక భాగం మాత్రమేనని గుర్తించాలి. ప్రత్యక్ష బోధన ద్వారానే ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య సహజ సంబంధం ఏర్పడుతుంది. విద్య కూడా ఒక సాగు వంటిదని, పంటలు పండించడానికి రైతు ఎంత శ్రమ పడతాడో, శిష్యునికి జ్ఞానం అందించే క్రమంలో గురువు కూడా అంతే తాపత్రయపడతాడని కవి గరిమెళ్ల నారాయణ తన కవితలో పేర్కొన్నారు.

ప్రస్తుతం కొన్ని చోట్ల ఉపాధ్యాయులను గౌరవించే సంప్రదాయం తగ్గిపోతుండటంతో పాటు వారిపై దాడులు కూడా జరుగుతున్నాయి. ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ విద్యార్థుల క్షేమాన్ని కోరుకుంటారు, వారి విజయాలను చూసి సంతోషిస్తారు. ఉపాధ్యాయులను గౌరవిస్తేనే విద్యార్థులు వివిధ రంగాల్లో రాణించడంతో పాటు వారి మధ్య అనుబంధం బలపడుతుంది. గురువులను గౌరవించడం అంటే కేవలం నమస్కారం చేయడం మాత్రమే కాదు. ఉపాధ్యాయ సిబ్బంది 30 ఏళ్లపాటు సేవలందించి పదవీ విరమణ పొందినప్పుడు వారికి న్యాయబద్ధంగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలి. ఉద్యోగ సమయంలో బోధనేతర పనుల భారం లేకుండా, గురువులు గౌరవంగా పనిచేసే వాతావరణం కల్పించాలి. విద్యార్థులకు నైతిక విలువలు బోధించే అవకాశం వారికి ఉండాలి. అదే సమయంలో గురువులు కూడా స్వీయ నియంత్రణ పాటిస్తూ, అప్పుడప్పుడు తమ పనితీరును సమీక్షించుకోవాలి. విద్యార్థుల్లో గుణాత్మకమైన మార్పు రావడానికి సమయం పడుతుంది కాబట్టి, అందుకు తగిన విద్యా ప్రణాళికలు అవసరం. గురువులు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకునే పరిస్థితిని కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా పాలక వర్గాలు ఆలోచన చేయాలి.

See also  స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన పెనుకొండ జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :