ఢిల్లీ పేలుడు కేసులో కీలక మలుపు.. కాన్పూర్‌లో మరో డాక్టర్ అరెస్ట్!

ఢిల్లీ, అక్టోబర్ 13, (జనస్వరం) : ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు కేసు విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏటీఎస్, ఢిల్లీ స్పెషల్ సెల్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్త బృందం కాన్పూర్‌లో భారీ సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో కార్డియాలజీ ఇనిస్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ మహమ్మద్ ఆరిఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

గత వారం అరెస్టయిన డాక్టర్ షాహీన్‌తో ఆరిఫ్ నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. షాహీన్ ఫోన్ రికార్డుల పరిశీలనలో ఆరిఫ్ పేరు బయటపడటంతో సొంతంగా సమాచారం సేకరించిన పోలీసులు అతడిని ప్రశ్నించేందుకు తీసుకెళ్లారు.

జమ్మూకశ్మీర్ అనంతనాగ్‌కు చెందిన ఆరిఫ్ నీట్-ఎస్ఎస్ 2024 బ్యాచ్ విద్యార్థి. ఫరీదాబాద్‌లోని అల్-ఫలా యూనివర్సిటీలో చదువుకున్నట్లు దర్యాప్తు వివరాల్లో వెల్లడైంది.

డాక్టర్ షాహీన్ ఎర్రకోట పేలుడు, ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ మధ్య ప్రధాన అనుసంధానకర్తగా వ్యవహరించినట్లు ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. జైష్-ఎ-మహమ్మద్, అన్సార్ గజ్వత్-ఉల్-హింద్‌తో సంబంధాలు ఉన్న ఫరీదాబాద్ మాడ్యూల్‌ను ఇటీవల పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. ధౌజ్ గ్రామంలోని అద్దె గదిలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసి డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనాయ్‌ను అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉండగా, కశ్మీర్‌కు చెందిన మరో డాక్టర్ నిసార్-ఉల్-హసన్ పేలుడు జరిగిన రోజునుండి అదృశ్యమయ్యాడు. ఉగ్రవాద సంబంధాల ఆరోపణలతో అతడిని ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించగా తరువాత అతడిని అల్-ఫలా యూనివర్సిటీ నియమించుకుంది.

See also  స్థానిక ఎన్నికల్లో పోరాడిన జనసేన అభ్యర్థులకు అభినందనలు - జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్