వసూళ్లకు కేరాఫ్ అడ్రస్ కారంచేడు తహసీల్దార్ కార్యాలయం

వసూళ్ళకు కేరాఫ్ అడ్రస్ గా మారిన కారంచేడు తహసీల్దార్ కార్యాలయం.
బ్రతికున్న వ్యక్తిని ‘చంపేసిన’ రెవెన్యూ యంత్రాంగం.. ముడుపుల మత్తులో యథేచ్ఛగా ఆస్తుల మార్పిడి!

కారంచేడు, ఏప్రిల్ 15,( జనస్వరం)

బాపట్ల జిల్లా కారంచేడు మండల రెవెన్యూ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులకు సేవలు అందించాల్సిన కార్యాలయం, అక్రమార్కులకు కొమ్ముకాస్తూ “ముడుపులు ఇస్తే చాలు.. బ్రతికున్న వ్యక్తినైనా కాగితాల్లో చంపేస్తాం” అనే రీతిలో వ్యవహరిస్తోంది. ఇక్కడ నిబంధనలు గాలికి వదిలేసి, కాసుల కక్కుర్తితో సామాన్యుల ఆస్తులను ఇతరుల పరం చేస్తున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఘాటుగా సాగిన ‘మరణం’ నాటకం!

చెన్నుపాటి రంగనాయకులు అనే వృద్ధుడికి సంబంధించిన 15 సెంట్ల భూమిని కాజేసేందుకు కొందరు అక్రమార్కులు వేసిన ప్లాన్‌కు రెవెన్యూ యంత్రాంగం పూర్తి సహకారం అందించింది.

షాకింగ్ వాస్తవం: బాధితుడు రంగనాయకులు నిక్షేపంగా బ్రతికే ఉన్నాడు. ఆయనకు ప్రభుత్వం నుంచి వృద్ధాప్య పెన్షన్ వస్తోంది, రేషన్ కార్డు మీద బియ్యం తీసుకుంటున్నారు, ఓటు హక్కు కూడా వినియోగించుకుంటున్నారు.

అక్రమం: కానీ, ఎమ్మార్వో ఆఫీస్ రికార్డుల్లో మాత్రం ఆయన చనిపోయినట్లు చూపిస్తూ, ఆ 15 సెంట్ల భూమిని ఆయన కోడలి పేరిట రిజిస్ట్రేషన్ మరియు ఆన్లైన్ మ్యుటేషన్ చేసేశారు.“మీరు బ్రతికే ఉన్నారా?” – ఎమ్మార్వో ఆశ్చర్యం వెనుక అసలు కథేంటి?తన ఆస్తి అన్యాక్రాంతమైందని తెలుసుకున్న సదరు వృద్ధుడు కార్యాలయానికి వెళ్లి నిలదీయగా, అక్కడి ఎమ్మార్వో “మీరు బ్రతికే ఉన్నారా?” అని ఆశ్చర్యం వ్యక్తం చేయడం విడ్డూరం. ప్రభుత్వం అన్ని పథకాలు అందిస్తున్న వ్యక్తి, ప్రభుత్వ రికార్డుల్లోనే మరణించినట్లు ఎలా కనిపిస్తాడో అధికారులకే తెలియాలి. ఆరు నెలల క్రితం అనారోగ్యంతో ఉన్నా కూడా బాధితుడు కార్యాలయం చుట్టూ తిరిగితే, “సరి చేస్తాం” అని నమ్మబలికిన అధికారులు ఇప్పటివరకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకపోవడం వెనుక భారీగా ముడుపులు అందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఆర్డీఓ కోర్టుకు సాగదీత.. బాధ్యత నుంచి తప్పుకుంటున్న అధికారులు.

ప్రశ్నిస్తే “ఆర్డీఓ దగ్గరికి పంపించాం, అక్కడ చూసుకోండి” అంటూ సమాధానం ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారు. తప్పు చేసినట్లు స్పష్టంగా ఆధారాలు ఉన్నా, తక్షణమే రికార్డులను సరిచేయకుండా కాలయాపన చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? కారంచేడు రెవెన్యూ సిబ్బంది అందరూ కలిసి ఈ అవినీతి భాగోతంలో వాటాలు పంచుకున్నారా అనే అనుమానాలు ప్రజల్లో బలపడుతున్నాయి.

ప్రజల ప్రశ్న: “డబ్బులు ఇస్తే బ్రతికున్న వాళ్ళని చంపేసి, ఆస్తులు మార్చేస్తారా? ఇదేనా మీ పరిపాలన?”

See also  ఒంగోలు జనసేనపార్టీ కార్యాలయంలో టీం పొలిటికల్ సేన రెండోవ వార్షికోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

ఇప్పటికైనా బాపట్ల జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని కారంచేడు ఎమ్మార్వో ఆఫీసులో జరుగుతున్న ఈ “రిజిస్ట్రేషన్ దందాలను” అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుని, బాధితుడికి న్యాయం చేయాలని కోరుతున్నారు.