
జనసేనాని పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ పార్ట్ – 1
జనసేనాని చాలా రోజుల తర్వాత మన ముందుకు ఇంటర్వ్యూ ద్వారా వచ్చారు. ఒకసారి జనసేనాని మనసులోని మాటను తెలుసుకుందాం.
ప్రశ్న : ప్రజా శ్రేయస్సు కొరకు చాతుర్మాస్య దీక్ష్య గురించి పూర్తి వివరాలు చెప్పండి సార్ !
జవాబు : ఇప్పటి వరకూ ఇలాంటి దీక్ష్యలు కేవలం నా వ్యక్తిగతం కోసమే చేసుకొనేవాడిని. మన పార్టీ వంతు సహాయంగా ఈ కరోనా సమయంలో ఆర్థిక సహాయం చేశాము ప్రజలకు. కానీ, భగవంతుడి ఆశీర్వదాలు కూడా అవసరం. అందుకే నేను ఈ చాతుర్మాస్య దీక్ష్య చేపట్టాను. ఈ దీక్ష్యను నేను 2003 వ సంవత్సరం నుండి మొదలుపెట్టాను. అంతకముందు అయ్యప్ప స్వామి మాలాధారణ, ఇతర దీక్ష్యలు చేసేవాడిని. కానీ నేను చేసే ఈ దీక్ష్యలు బయటకు తెలిసేవి కావు. ప్రస్తుతం నేను ప్రజాశ్రేయస్సు కొరకు ప్రజా జీవితంలో ఉన్నాను కాబట్టి బహిర్గితం చేశాను. ఈ సృష్టిని నడిపించే శ్రీ మహావిష్ణువు శయనించే కాలం ఇది. ఆయన భక్తులు ఈ కాలంలో ఈ దీక్ష్యను చేపడతారు. నేను ఈ కరోనా సమయంలో ఈ కరోనా మహమ్మారి నుంచి సమస్త మానవాళి బయట పడాలని ఈ దీక్ష్య చేస్తున్నాను.
ప్రశ్న : మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ కరోనా వైరస్ ను ప్రభుత్వం సరిగ్గా ఎదుర్కోవట్లేదాని వైద్యులు అంటున్నారు. మీ అభిప్రాయం ?
జవాబు : ఈ కరోనా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే వచ్చిన మహమ్మారి కాదు. ప్రపంచం మొత్తం వచ్చిన మహమ్మారి. మన రాష్ట్ర ముఖ్య నేతలు కూడా ఇది కేవలం ఒక ఫ్లూ అని ప్రజలను మభ్యపెట్టడం బాధాకరం. అప్పటికి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వలన చాలా నష్టం జరిగింది. కేంద్ర ప్రభుత్వం విధించిన 2నెలల లాక్ డౌన్ కాలంలో ప్రభుత్వం మరింత చర్యలు తీసుకొని ఉంటే కొంత మేర ఈ మహామ్మరి నుండి బయటపడేవాళ్లం. రాష్ట్రంలో కేవలం టెస్టింగ్ లు ఎక్కువ చేస్తున్నారు గానీ, కరోనా బాధితులను పట్టించుకోవట్లేదు అని చాలా స్పష్టం అవుతోంది. నేను కూడా ప్రభుత్వాన్ని టెస్టింగ్ లు ఎక్కువ చేస్తున్నారని మనస్ఫూర్తిగా అభినందించాను. అయితే కరోనా బాధితులకు సరైనా వైద్యం అందించట్లేదు, బాధితులకు సరిపడా వైద్య సదుపాయాలు కూడా లేవు .
మన రాష్ట్రంలో ప్రజాప్రతినిధులే క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించకపోగా, ప్రజలలో కరోనా గురించి అపోహలు సృష్టించడం వలన సామాన్య ప్రజలు భయాందోళనకు గురవ్వడం బాధాకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకొని కరోనా నివారణ మీద చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాను. అలాగే ప్రజలు కూడా సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు తప్పనిసరిగా ధరిస్తూ, తమ నిరోధక శక్తిని పెంచుకోవాలని కోరుకుంటున్నాను.
ప్రశ్న : ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అవతవకలు పాల్పడుతుందని భావిస్తున్నారా ?
జవాబు : ప్రస్తుత పరిస్థితులు చూస్తోంటే నిజమే అనిపిస్తోంది. ప్రతి పేద వాడికి సొంతిల్లు అనేది కల. గత ప్రభుత్వంలో కూడా ఇందిరా గాంధీ గృహ ప్రవేశం పథకం కింద పేదలకు ఇల్లు కట్టించడం చూశాం. అయితే నేను కర్నూలు, మంగళగిరి పర్యటనకు వెళ్ళినపుడు ఇల్లు కట్టడం పూర్తి అయ్యాయి కానీ, లబ్ధిదారులకు ఇవ్వకుండా గత, ఇప్పటి ప్రభుత్వాలు జాప్యం చేస్తున్నాయి. లబ్దిదారులు కొంత మొత్తంగా డబ్బులు గత ప్రభుత్వానికి చెల్లించామని, తీరా ఇప్పుడు ఈ ప్రభుత్వం కక్ష్య సాధిపు చర్యలు చేసి నిజమైన లబ్ధిదారులకు ఆ ఇళ్ళు చెందకుండా తమ పార్టీ కార్యకర్తలకు అందజేస్తున్నారని తన దృష్టికి తీసుకువచ్చినపుడు చాలా బాధాకరం అనిపించింది. బాధితుల పక్షాన నిలబడి పోరాడటం చేయడంలో భాగంగా జనసేన ~ బిజెపీ పార్టీలు ఇరువురు సంయుక్తంగా ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా కూడా కార్యకర్తలు అందరూ కూడా తమ ఇళ్ళల్లో సామాజిక దూరం పాటిస్తూ నిరసన చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేలుకొని నిజమైన లబ్ధిదారులకు ఈ పథకం వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను.
ప్రశ్న : పేదలకు ఇచ్చే భూముల విషయంలో మరియు భూ సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని భావిస్తున్నారా ?
జవాబు : ఎన్నికల్లో ఇచ్చే హామీలను చాలా వరకు అమలుపరచకపోవడం, ఆ మోసపూరిత విధానాలను అర్థం చేసుకొని ప్రజలు ఉన్నంత వరకూ ఇలాంటి పరిస్థితి తప్పదు. ప్రజలు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారంటే కాస్తా ఆలోచించాలి, ఎందుకంటే అది సాధ్యమయ్యే పనేనా అని, స్వాతంత్ర్యం వచ్చిన కాలం నుండి ఇప్పటివరకూ అన్ని ప్రభుత్వాలు కూడా ఇళ్ల పట్టాలు ఇస్తున్నా కూడా ఇంకా పేదలు ఎందుకు మిగిలారు. ఎన్నికల హామీల్లో కొన్ని లక్షల మందికి ఇస్తామని, తర్వాత కొందరికి మాత్రమే ఇచ్చి అందరికీ ఇచ్చినట్టు ఈ ప్రభుత్వాలు పబ్లిసిటీ చేసుకుంటున్నాయి. ముఖ్యంగా దళితుల భూములు, అసైన్డ్ భూములలో అవతవకలు జరుగుతున్నాయి. నాకు వచ్చిన సమాచారం బట్టి ప్రైవేట్ భూములను దళారీలు అతి తక్కువ ధరకు ప్రజల దగ్గర కొని, ప్రభుత్వం దగ్గర 5 రెట్లుకు పైగా అమ్మేలా చేస్తూ, ప్రజల సొమ్మును దుర్వినియోగం అయ్యేలా చేస్తున్నారని తెలుస్తోంది. ఇలాంటి అవతవకలను ప్రభుత్వం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని, అలాగే అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేయాలని, ఒకవేళా ఆ అర్హులకు ఇవ్వని పక్షంలో ఎందుకు ఇవ్వట్లేదో జవాబుదారీతనం ఇవ్వాలని కోరుతున్నా.
ప్రశ్న : రాజధాని విభజన, సి ఆర్ డీ ఏ బిల్లుల విషయంలో మీ అభిప్రాయం ?
జవాబు : మూడు రాజధానుల బిల్లు, సి ఆర్ డీ ఏ రద్దు బిల్లు అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదింపచేయడం జరిగింది. మండలిలో ఈ బిల్లుకు ఆమోదం అవసరం లేదని ఆ బిల్లును గవర్నర్ దగ్గరకు పంపగా పెండింగ్ లో ఉండడం చూస్తున్నాం. జనసేన పార్టీ పెద్దలు కూడా ఈ విషయమై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తున్నపుడు హైదారాబాద్ లాంటి పెద్ద నగరం మన ఆంధ్రప్రదేశ్ లో లేకపోవడం బాధాకరమని నాతో చర్చించారు. అమరావతి రాజధానిగా ప్రకటిస్తూ కొన్ని వేల ఎకరాలు సేకరించడం అనేది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఒక తప్పు నిర్ణయం. ఇప్పటికీ కూడానూ నా వ్యక్తిగత తరపున, పార్టీ తరుపునా అన్ని వేల ఎకరాలు సేకరించడం ఒక తప్పిద నిర్ణయం. అన్ని వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి సేకరించి సింగపూర్ లాంటి రాజధాని నిర్మిస్తాము అంటే అక్కడి తరహా వ్యవస్థ, రాజకీయ విధానము లేదు మన దగ్గర. నేను ఆరోజు కూడా రైతులకి, తెలుగుదేశం ప్రభుత్వంకు చెప్పా, ఒకవేళ రాజధాని అభివృద్ధి చేయలేదంటే మొదటికే మోసం వస్తుందని చెప్పడం జరిగింది. ఇప్పటి వైసీపీ ప్రభుత్వం ఆరోజు అసెంబ్లీలో అమరావతి రాజధానికి అంగీకరించి నేడు మూడు రాజధానులకు మొగ్గు చూపడం హాస్యాస్పదం. రైతులు ఇచ్చినా భూముల్లో ఏవైనా అవకతవకలు జరిగింటే సరిచేయాలి గానీ, పోరాటం చేస్తున్న రైతుల మీద పోలీసుల జులుం విధించడం సరికాదు. అభివృద్ది వికేంద్రీకరణ జరగాలి గాని ఇలా జరగడం సవ్యం కాదు.
ప్రశ్న : మన రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్నా ఆరాచకల మీద స్పందన ఏంటి ?
జవాబు : సాక్షాత్తు ఈ రాష్ట్ర హోమ్ మంత్రి దళిత వర్గానికి చెందిన ఆమె పరిపాలనలో దళితుల మీద దాడి జరగడం బాధాకరం. ఆ దళిత వర్గం నుంచి వచ్చిన ఆమె వారికి రక్షణ కల్పించకపోవడం బాధాకరమైన విషయం.
ప్రశ్న : రాజమండ్రిలో జరిగిన శిరోముండన కేసులో దోషులపై కేసులు నమోదు చేయకపోవడం వెనుక మీ ఆంతర్యం ఏమిటి ?
జవాబు : అప్పట్లో దళిత డాక్టర్ సుధాకర్ మీద పని చేసిన వ్యవస్థ ఇపుడు ఈ శిరోముండన కేసులో ఎందుకు మూగబోయింది. ఆ వ్యవస్థ పని చేయకపోగా ప్రభుత్వ కార్యకర్తల్లాగా పోలీసు వ్యవస్థలో పని చేయడం అనుమానాలకు దారి తీస్తోంది. ఆ సంఘటనకు కారణం అయిన వారిని ప్రభుత్వం శిక్షించకపోతే, రాబోయే రోజుల్లో దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు పోరాటం ఉధృతం చేయవచ్చు.
పవన్ కళ్యాణ్ జనసేనాని ఇంటర్వ్యూ పార్ట్ – 1 PDF లో డౌన్లోడ్ చేసుకోండి.








