
తూర్పు గోదావరి జిల్లా, గోకవరం మండలం, కృష్ణునిపాలెం పంచాయతీ పరిధిలో, పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల పునరావాస కాలనీ నిర్మాణంలో జరుగుతున్న నాణ్యతా లోపమైన పనుల గురించి ఆ ప్రాంతంలో జగ్గంపేట జనసేన ఇంచార్జ్ శ్రీ పాతంశెట్టి సూర్యచంద్ర గారు మరియు తదితర జనసేన నాయకులు సందర్శించారు. ఆయన మాట్లాడుతూ డ్రైనేజ్ సమస్యలు, సెప్టిక్ ట్యాంక్ సమస్యలు, కట్టించిన బిల్డింగుల వాటర్ లీకేజి, వీధి దీపాలు లేకపోవడం దారుణమని అన్నారు. రెండు వాటర్ ట్యాంకులు కట్టించిన ఇంకా పూర్తిగా త్రాగునీరు ఏర్పాటు చేయకపోవడం, వారికి ఇస్తామన్న R&R ప్యాకేజీ ఇప్పటికీ పూర్తిగా ప్రభుత్వం ఇంకా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు కట్టించిన ఒక్క ఇల్లు కూడా నాణ్యతగా లేదని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ, యువకులకి R&R యాక్ట్ ప్రకారం ప్యాకేజీ కల్పించాలని అధికారులను కోరారు. R&R కాలనీలో పూర్తిగా ప్రజలకు ఏర్పాటు చేయవలసిన వసతులు అన్ని నాణ్యతా లోపాలు లేకుండా పూర్తి చేసి ప్రజలకు అందించాలని బాధితులతో పాటుగా స్పెషల్ కలెక్టర్ గారిని కలిసి అన్ని విషయాలపై చర్చించి తదుపరి వినతి పత్రం అందించారు. ఈ విషయంపై పోలవరం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ ఆనంద్ గారు చాలా సానుకూలంగా స్పందించి R&R కాలనీ ప్రజలు అందరికీ తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.








