
అనంతపురము, ఏప్రిల్ 2, జనస్వరం : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సాగుతున్న నిర్మాణాలు పూర్తయితే ప్రపంచవ్యాప్తంగా అఖండఖ్యాతి దక్కుతుందని ప్రముఖ సామాజికవేత్త, కేంద్ర ప్రభుత్వ “రాజ్యమహిళా సమ్మాన్” అవార్డు గ్రహీత డాక్టర్ నల్లాని రాజేశ్వరి అభిప్రాయపడ్డారు. రాజధాని అమరావతి చట్టబద్ధతకు సంబంధించిన బిల్లు ఉభయసభల్లో ఆమోదం పొందడం పట్ల డాక్టర్ నల్లాని రాజేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లుల ఆమోదంతో చట్టపరంగా రాజధానికి మరింత బలం చేకూరిందని పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ల నిరంతరకృషితో అమరావతికి చట్టబద్ధత వచ్చిందన్నారు. ఈ సమయంలో అమరావతికి దీప హారతులు ఇద్దామని రాష్ట్ర ప్రజలకు లోకేష్ పిలుపునివ్వడంతో విశేషస్పందన కనిపించిందన్నారు. గురువారం రాత్రి 7 గంటలకు అంతా ఇళ్ల ఎదుట దీపాలు వెలిగించారని చెప్పారు. ఈ దీపాలతో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేయాలని ప్రజలను మంత్రి లోకేశ్ కోరడంతో సమిష్టిగా ఆనందాన్ని పంచుకున్నారని చెప్పారు. #APThanksIndia హ్యాష్‌ట్యాగ్‌తో అందరూ ఫొటోలు షేర్ చేశారని స్పష్టంచేశారు. అమరావతికి సహకరించిన అందరికీ ఈ సందర్భంగా నల్లాని రాజేశ్వరి ధన్యవాదాలు తెలిపారు. అమరావతి అంటే 5 కోట్ల ఆంధ్రుల గుండెచప్పుడు అని అభివర్ణించారు. సీఎం చంద్రబాబు పిలుపుతో రైతులు 33 వేల ఎకరాల భూములు ఇచ్చారని గుర్తుచేశారు. దేశంలో 40 పార్టీలు మద్దతు తెలిపిన రాజధాని అమరావతిని.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచస్థాయిలో నిలబెడతారని తెలిపారు.








