హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన HYMNNSCon 2026 అంతర్జాతీయ న్యూరాలజీ సదస్సు

– ప్రపంచ నలుమూలల నుంచి హాజరైన 500 మందికి పైగా న్యూరాలజిస్టులు, పరిశోధకులు, సబ్‌స్పెషలిస్టులు

– ముఖ్య అతిథిగా హాజరైన భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జె.ఎమ్. లింగ్డో

హైదరాబాద్, జూలై 25 (జనస్వరం):బంజారాహిల్స్‌లోని రెనోవా సెంచరీ హాస్పిటల్స్‌కు చెందిన రెనోవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ శాస్త్రీయ సదస్సు HYMNNSCon 2026 (Hyderabad Muscle, Nerve and Neuroimmunology Society Conference) శుక్రవారం తాజ్ డెక్కన్ హోటల్‌లో ఘనంగా ప్రారంభమైంది. జూలై 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సు ‘హాట్ టాపిక్స్ ఇన్ న్యూరోమస్క్యులర్ మెడిసిన్ అండ్ న్యూరోఇమ్యునాలజీ’ అనే ప్రధాన అంశంపై కొనసాగనుంది. న్యూరోమస్క్యులర్, న్యూరోఇమ్యునాలజీ వ్యాధుల నిర్ధారణ, ఆధునిక చికిత్సలు, పరిశోధనలపై చర్చించేందుకు భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 మందికి పైగా ప్రముఖ న్యూరాలజిస్టులు, న్యూరోమస్క్యులర్ నిపుణులు, న్యూరోఇమ్యునాలజిస్టులు, వైద్య పరిశోధకులు, అధ్యాపకులు ఈ సదస్సుకు హాజరయ్యారు. భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జె.ఎమ్. లింగ్డో ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించగా, రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు, సీఈఓ శ్రీధర్ పెద్దిరెడ్డి అతిథిగా పాల్గొన్నారు. ఈ సదస్సులో మల్టిపుల్ స్క్లెరోసిస్, ఆటో ఇమ్యూన్ నరాల వ్యాధులు, మయాస్థీనియా గ్రావిస్, పెరిఫెరల్ న్యూరోపతి, కండరాల వ్యాధులు, కొత్తగా అందుబాటులోకి వస్తున్న న్యూరోఇమ్యునోలాజికల్ చికిత్సలపై కీలక ప్రసంగాలు, ప్యానెల్ చర్చలు, సమకాలీన అంశాలపై విశ్లేషణలు, కేస్ స్టడీల ఆధారిత చర్చలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సదస్సు నిర్వహణ కార్యదర్శి డాక్టర్ వై. మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ, “న్యూరోమస్క్యులర్ మెడిసిన్, న్యూరోఇమ్యునాలజీ రంగాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇవి నరాల సంబంధిత చికిత్సల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. వైద్యులు, పరిశోధకులు కొత్త సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి, సంక్లిష్టమైన కేసులను చర్చించడానికి HYMNNSCon 2026 సరైన వేదిక. ఇక్కడ జరిగే వైజ్ఞానిక చర్చలు కొత్త పరిశోధనలకు బాటలు వేస్తూ, చివరికి రోగులకు నాణ్యమైన, అత్యుత్తమ వైద్య సేవలు అందించడానికి తోడ్పడతాయి” అని పేర్కొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన జె.ఎమ్. లింగ్డో, శ్రీధర్ పెద్దిరెడ్డి, అంతర్జాతీయ, జాతీయ అధ్యాపకులు, స్టీరింగ్ కమిటీ సభ్యులు, ప్రతినిధులు, పాల్గొన్న వైద్య నిపుణులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సదస్సులో విదేశాల నుంచి విచ్చేసిన ప్రముఖ ప్రొఫెసర్లు ప్రొఫెసర్ క్రిస్టీన్ లెబ్రున్-ఫ్రెనే (ఫ్రాన్స్), ప్రొఫెసర్ హెల్ముట్ బుట్జ్‌క్యువెన్ (ఆస్ట్రేలియా), ప్రొఫెసర్ సాండ్రా వుకుసిక్ (ఫ్రాన్స్), ప్రొఫెసర్ స్టీఫెన్ రెడ్డెల్ (ఆస్ట్రేలియా), ప్రొఫెసర్ జెన్నీన్ ఎమ్. హెక్మాన్ (దక్షిణాఫ్రికా), ప్రొఫెసర్ ఉమాపతి ఎన్. తిరుజ్ఞానం (సింగపూర్)తో పాటు భారత్‌కు చెందిన పలువురు ప్రముఖ వైద్యులు తమ ప్రసంగాలను అందించనున్నారు. ఈ సదస్సును డాక్టర్ (ప్రొఫెసర్) జె.ఎమ్.కె. మూర్తి (ప్యాట్రన్), డాక్టర్ వై. మురళీధర్ రెడ్డి (ఆర్గనైజింగ్ సెక్రటరీ), డాక్టర్ లలిత పి. (జాయింట్ సెక్రటరీ), డాక్టర్ అభినయ్ కుమార్ జి. (జాయింట్ సెక్రటరీ), డాక్టర్ సుభేందు పరిడా (ట్రెజరర్)తో కూడిన స్టీరింగ్ కమిటీ మార్గదర్శకత్వంలో నిర్వహిస్తున్నారు.

See also  టమోటా రైతులను ప్రభుత్వము తక్షణమే ఆదుకోవాలి : అనంతపురం జనసేన నాయకులు