
– పంచామృతాభిషేకాలతో ప్రత్యేక పూజలు
– సనాతన ధర్మ పరిరక్షణకు పిలుపు : మరక నాగేంద్ర
అనంతపురం అర్బన్ (జనస్వరం) : నగరంలోని అరవింద్‌నగర్ ఫస్ట్ క్రాస్ సమీపంలో హనుమాన్ జయంతి వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాగేంద్ర పూజారి, ఆలయ కమిటీ సభ్యుల సమన్వయంతో నిర్వహించిన ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం 6 గంటల నుంచే స్వామివారికి పంచామృతాభిషేకాలు, ఆకుపూజ, వస్త్రాలంకరణ వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణం, మహా నైవేద్య కార్యక్రమాలు జరిగాయి. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షుడు కొనుగొండ్ల రాజేష్, జిల్లా కార్యదర్శి నరేంద్ర, అరవింద్‌నగర్ ఇన్‌చార్జ్ మరక నాగేంద్ర యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మరక నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ హనుమాన్ జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి హిందువు బాధ్యత అని, యువత ధార్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. శ్రీరామ భక్తుడైన హనుమంతుడు ధైర్యం, భక్తి, సేవాభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి ఇంటిలో ఆధ్యాత్మిక చైతన్యం పెరగాలని, భవిష్యత్తులో కూడా ఇలాంటి ధార్మిక కార్యక్రమాలను మరింత ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరవింద్‌నగర్ నాయకులు కేశవరెడ్డి, సురేష్ రాయల్, నాని, చంద్రమోహన్ రెడ్డి, నాగేంద్రమ్మ, శ్రీదేవి, అలేఖ్య, ప్రతాప్, వాల్మీకి మల్లిఅర్జున్ తదితరులు పాల్గొన్నారు. అరవింద్‌నగర్‌కు చెందిన వందలాది కుటుంబాలు సతీసమేతంగా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. భవిష్యత్తులో కూడా హనుమాన్ జయంతి, శ్రీరామనవమి వేడుకలను మరింత ఘనంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.








