
నెల్లూరు, జూలై 24 (జనస్వరం): నెల్లూరు రూరల్ పరిధిలోని కలివెలపాలెం ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలివెలపాలెం తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు వెండిచర్ల వెంకటేశ్వర్లు యాదవ్ పాల్గొన్నారు. ఆయనకు పాఠశాల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలోని సరస్వతి దేవి విగ్రహానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వెండిచర్ల వెంకటేశ్వర్లు యాదవ్ మాట్లాడుతూ, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం వారి అభివృద్ధిలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమన్వయం ఎంతో అవసరమని అన్నారు. పిల్లల చదువు, ప్రవర్తనపై ఉపాధ్యాయులకు స్పష్టమైన అవగాహన ఉంటుందని, తల్లిదండ్రులు తరచూ ఉపాధ్యాయులతో మాట్లాడి పిల్లల పురోగతిని తెలుసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.








