సోమశిల నిర్వహణ పై ప్రభుత్వం దర్యాప్తు జరపాలి : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

సోమశిల నిర్వహణ పై ప్రభుత్వం దర్యాప్తు జరపాలి : కేతంరెడ్డి వినోద్ రెడ్డ

                 జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి నేడు నెల్లూరు పెన్నా బ్యారేజి ప్రాంతాన్ని సందర్శించి నదిలో వరద తీరుతెన్నులను పరిశీలించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పెన్నా తీవ్ర వరద, నెల్లూరు నగరం నీట మునక నివర్ తుఫాన్ కారణంగా ఏర్పడింది కాదని సోమశిల రిజర్వాయర్ నిర్వహణా లోపం, నీటి వనరుల నిర్వహణ లోపం కారణంగా ఏర్పడిన కృత్రిమ వరదని పేర్కొన్నారు. ఈ అంశంలో జలవనరుల శాఖ తీరు, వైఫల్యం సవివరంగా ఆధారాలతో సహా తెల్పుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. రెండు నెలల క్రితం సెప్టెంబర్ 19 న ఒక్కసారిగా 2 లక్షల క్యూసెక్కులు వదిలి నెల్లూరు నగరం నీట మునిగిన సమయంలో దానికి గల కారణాలను అన్వేషించి సెప్టెంబర్ 22 వ తేదీన సోమశిల నిర్వహణ లోపం పై జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు గారికి ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేశారు. 65 టీఎంసీల నీరు చేరాక సోమశిలలో వాటర్ కుషన్ లెవల్ మైంటైన్ చేస్తూ ఇన్ ఫ్లో ఫోర్ క్యాస్ట్ చేస్తూ దిగువ ప్రాంతానికి అవుట్ ఫ్లో వదలాలని కానీ అక్కడి అధికారులు డ్యామ్ పూర్తి సామర్ధ్యం 78 టీఎంసీలు చేరే వరకు నిద్రపోయారని, ఒక్కసారిగా భారీ వరద వదిలిన విషయాన్ని తెలిపారు. ఆ సమయంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆ తతంగాన్ని డ్రోన్ వీడియోలు తీసిన తీరుని తాము విమర్శించిన విధానాన్ని గుర్తు చేసారు. సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో జిల్లాలో మరియు సోమశిల క్యాచ్ మెంట్ ప్రాంతంలో వర్షాలు పడతాయని, తుఫాన్లు కూడా వస్తుంటాయని కాబట్టి వాటర్ కుషన్ లెవల్ పరిశీలిస్తూ నీటి నిర్వహణ చేయాలని ఆనాడు కలెక్టర్ ఎదుట తెలిపిన విషయాన్ని గుర్తు చేసారు. రెండు నెలల క్రిందటే తాము హెచ్చరించినా కూడా సోమశిలలో 75 టీఎంసీల మేర నీటిని ఉంచాల్సిన అవసరం ఏమొచ్చిందని, ఇప్పుడదే కదా ఇంత వరదకు కారణం అయ్యిందని దుయ్యబట్టారు. ఎప్పుడో 1946 లో రంగనాథస్వామి గుడిలోకి వచ్చిన వరద సోమశిల నిర్మాణం తర్వాత ఎప్పుడూ గుడిలోకి రాలేదని, కానీ ఇప్పుడు వీరి నిర్వహణ లోపం కారణంగా వచ్చిందని, ఇది నెల్లూరు నగరానికి అరిష్టం అని అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు కూడా ఎప్పుడు వర్షాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయని నెలల క్రిందటే వీరికి తెలుపుతారని అయినా కానీ 75 టీఎంసీలు ఉంచి ఇప్పుడు ఒక్కసారిగా 8 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగానే చేతులెత్తేసి అన్ని గేట్లు ఎత్తేసి తీవ్ర ముంపుకి కారణం అయ్యారని దుయ్యబట్టారు. అందుకే ఇది ప్రకృతి వైపరీత్యం కాదని నీటి పారుదల శాఖ వారి వైపరీత్యం అని దుయ్యబట్టారు. దీనిపై ప్రభుత్వం అత్యున్నత కమిటీ వేసి దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.  ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, హేమంత్, కుక్కా ప్రభాకర్, కస్తూరయ్య, సురేష్, హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

See also  అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రక్కులను అడ్డుకున్న ఆత్మకూరు జనసేన నాయకులు