
దెందులూరు, మార్చి 30 (జనస్వరం) : దెందులూరు మండలం పోతునూరు గ్రామంలో లక్ష్మీ ఫిల్లింగ్ స్టేషన్ నూతన వ్యాపార ప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై పెట్రోల్ బంక్ సేవలను లాంఛనంగా ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సౌకర్యాలు పెరగడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు ఇంధనం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని తెలిపారు. ఈ ఫిల్లింగ్ స్టేషన్ ద్వారా రైతులు, వాహనదారులు సులభంగా సేవలు పొందగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. స్థానిక ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో హాజరై కొత్త ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభాన్ని స్వాగతించారు.








