రైతులు… ఆడపడుచుల కన్నీళ్లు పాలకులను దహించి వేస్తాయి – శ్రీ పవన్ కల్యాణ్ గారు

రైతులు… ఆడపడుచుల కన్నీళ్లు పాలకులను దహించి వేస్తాయి – శ్రీ పవన్ కల్యాణ్ గారు

             రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులతో కన్నీళ్లు పెట్టించడం ఎంత మాత్రం క్షేమకరం కాదు అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు చెప్పారు. ఎన్నడూ ఇళ్ల నుంచి బయటకు రాని ఆడపడుచులు, వృద్ధులు రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వ నిర్ణయంపై నిరసన చెబుతున్నారు అంటే ఎంత ఆవేదన వారిలో ఉందో అర్థం చేసుకోవాలన్నారు. మంగళవారం సాయంత్రం మంగళగిరి జనసేన కార్యాలయంలో రాజధాని ప్రాంత రైతులు, దళిత జె.ఏ.సి. సభ్యులు శ్రీ పవన్ కల్యాణ్ గారితో సమావేశం అయ్యారు. 

               ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతే రాజధానిగా ఉండాలని భారతీయ జనతా పార్టీ కూడా కోరుకొంటుంది. అమరావతినే రాజధానిగా గుర్తిస్తున్నామని బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రత్యేకంగా చెప్పారు. ఈ యేడాది జనవరి 11వ తేదీన బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా ఆ మేరకు తీర్మానం చేసింది. మేము ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకులతో సమావేశం కావడానికి ముందే ఆ తీర్మానం చేశారు. రైతులు, ఆడపడుచుల కన్నీళ్లు పాలకులను దహించి వేస్తుంది. అమరావతి ఉద్యమాన్ని ఆడపడుచులే ముందుకు తీసుకువెళ్లాలి. వారికి జనసేన పార్టీ అండగా నిలుస్తుంది. ప్రభుత్వం మారినా గత ప్రభుత్వ నిర్ణయాలను కొనసాగించాలి.

జగన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అమరావతిని ఒప్పుకొన్నారు : 

                   రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని దాదాపు ఏడాది కాలంగా నిరసన తెలుపుతూ లాఠీ దెబ్బలు తింటున్నారు. ఆడపడుచులు, వృద్ధులు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలపడం కలిచివేసింది. దళితుల రక్షణ కోసం తీసుకొచ్చిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ను దళితులపైనే ఉపయోగించి వారి చేతికే సంకెళ్లు వేసి ప్రభుత్వం తన స్థాయిని దిగజార్చుకుంది. తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ రెడ్డి గారు అప్పుడే ఇష్టం లేదని చెప్పి ఉంటే రైతులు భూములు ఇవ్వడానికి ఇష్టపడేవారు కాదు. అప్పుడేమో అసెంబ్లీ సాక్షిగా అమరావతికి ఒప్పుకొని… ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అనడం సరైన పద్ధతి కాదు. అప్పుడు లేని కులం ఇప్పుడు ఎందుకొచ్చింది. రాజధాని ప్రాంతంలో ఒకే కులానికి చెందినవారు మాత్రమే ఉంటే అనాడే వ్యతిరేకించాల్సింది. రాజధాని ప్రాంతంలో గతంలోనూ రైతులు ఇబ్బందిపడితే అండగా నిలిచాను. ఇటీవల మృతి చెందిన శ్రీ లాజర్ గారు నన్ను కలిసినప్పుడు దళిత రైతులకు చెందిన అసైన్డ్ భూములకు సరైన పరిహారం ఇవ్వడం లేదు అని ఆవేదన చెందారు. వారికి మద్దతుగా వెన్నంటి ఉన్నాను.

See also  గిరిజనుల సమస్యలు తెలుసుకునేందుకు మన్యం గ్రామాల్లో పర్యటించిన జనసేన నాయకులు సాయిబాబా

ఆ రైతు మాటలు కలిచివేశాయి : 

                         అభివృద్ధి పేరుతో రైతుల భూములు లాక్కుంటే వారు పడే బాధను ప్రత్యక్షంగా చూశాను. 2004లో సెజ్ ల పేరుతో వేలాది ఎకరాల భూములు రైతుల నుంచి సేకరించారు. ఇప్పటి వరకు రైతులకు సరైన నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు. అదీకాక దేనికోసమైతే భూములు తీసుకున్నారో ఆ పరిశ్రమలు కూడా రాలేదు. ఇవన్నీ చూసి ఒక రైతు ‘ఊళ్ల కోసం రోడ్లు వేయడం చూశాము.. కానీ రోడ్లు కోసం ఊళ్లు తీసేయడం చూడలేద’ని అన్న మాట ఇప్పటికీ నన్ను కలిచివేస్తుంది. అధికార, ప్రతిపక్షాలు ఇలా అన్ని వర్గాల వారు ఒప్పుకొని రాజధాని అమరావతిలో పెట్టాక దానికి రకరకాల కారణాలు చెప్పి మార్చేయడం బాధాకరం. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు ఇక్కడ ప్రాంత రైతులకు ఉంది. అలాగే రాజధాని కదల్చకుండా పోరాటం చేసే హక్కు కూడా ఉంది. మీ భూములు మీకు ఇచ్చేద్దామంటే భూములు లేవు. గుంతలు తవ్వేశారు, రోడ్లు వేసేశారు, బిల్డింగులు కట్టేశారు. జనసేన పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదు. అమరావతికి అనుకూలంగా మాట్లాడితే మిగిలిన ప్రాంతాల్లో ఇబ్బంది ఉంటుందన్న భయాలు జనసేనకు లేవు. జనసేన పార్టీ సత్యాన్ని నమ్ముతుంది. సత్యం అన్ని చోట్ల ఒకేలా ఉంటుంది. 

ఆ బాధ్యత పోలీసులదే : 

                      దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి ప్రభుత్వం తన ప్రతిష్టను దిగజార్చు కుంది. కేసులు పెట్టేముందు పోలీసు శాఖ కూడా ఒక్కసారి ఆలోచించాలి. పొలిటికల్ బాసులు చెప్పినట్లు ఇష్టారాజ్యంగా చేసేస్తే వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతాయి.  అమెరికా వంటి దేశాల్లోనే ప్రజలకు కోపం వస్తే రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపారు. అలాంటి బలమైన దేశంలోనే ప్రజలు రోడ్ల మీదకు వచ్చినప్పడు… ఇంత అవకతవకలు జరిగిన రాజధాని విషయంలో ప్రజలు రోడ్లు మీదకు వస్తే ఏం జరుగుతుందో ఆలోచించుకోవాలి. ప్రభుత్వం, పోలీసు శాఖ బాధ్యతగా తీసుకొని దళితులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలి. ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా నిరసన తెలిపే హక్కు ఉంది. కాదని రాజధాని రైతులను ఇబ్బందులకు గురి చేస్తే జనసేన పార్టీ తరపున బలమైన నిరసన కార్యక్రమాలు చేస్తామ”ని హెచ్చరించారు. 

రైతులకు మేలు జరగాలి: శ్రీ నాదెండ్ల మనోహర్ గారు : 

See also  పాలకులు రాజ్యాంగ ధర్మం ఆచరించేలా ప్రతీ పౌరుడు బాధ్యత తీసుకోవాలి ~ జనసేన చేనేత వికాస విభాగ రాష్ట్ర కార్యదర్శి కాటం అశ్విని

                      పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “రాజధాని సమస్య కేవలం అమరావతి రైతులది మాత్రమే కాదు… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరిదని మొట్టమొదటిగా మాట్లాడింది శ్రీ పవన్ కళ్యాణ్ గారే. ప్రభుత్వాలు మారినంత మాత్రాన నిర్ణయాలు మారకూడదు. ప్రభుత్వాలు రాజ్యాంగ హక్కులు గౌరవించే విధంగా పాలన చేయాలి. రాజధాని రైతులు, మహిళలు గత 330 రోజులుగా పడుతున్న అవమానాలు, కష్టాలు వర్ణనాతీతం. ఎవరైనా ఆనందంగా భూములు ఇస్తే తీసుకోండి కానీ బలవంతంగా లాక్కుంటే మాత్రం పోరాటం చేస్తామని నాలుగేళ్ల క్రితమే శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. రాజధాని రైతుల ఆందోళనకు అండగా ఉండేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ తరపున నాయకులను పంపించారు. ప్రజాస్వామ్యంలో సమస్యలు చెప్పుకునే వెసులుబాటును కూడా ప్రభుత్వం తీసేసింది. రాజధాని రైతుల ఆందోళనకు జనసేన పార్టీ అండగా ఉంటుంది. రైతులకు మేలు జరగాలి. తద్వారా రాష్ట్రానికి మేలు జరగాలి” అన్నారు.

                   అమరావతి రైతులు తమ ఆవేదనను తెలియచేస్తూ “ప్రభుత్వానికి భూములు ఇచ్చి 330 రోజులుగా మహిళలు రోడ్డునపడాల్సి వచ్చిందంటే రాష్ట్రంలో ప్రతి పౌరుడు సిగ్గు పడాల్సిన విషయం. కన్న బిడ్డలకు భూములు ఇచ్చేందుకే ఏళ్ల తరబడి ఆలోచించే పరిస్థితుల్లో రాజధాని కోసం అని భూములు ఇచ్చినందుకు మేము రోడ్డెక్కాలా? ప్రభుత్వం దిగిరావాలంటే శ్రీ పవన్ కల్యాణ్ గారి లాంటి నాయకుడి అవసరం ఉంది.  ఆయన మా కోసం ఓ నమ్మకం, భరోసా కల్పిస్తారన్న నమ్మకంతో పార్టీ కార్యాలయానికి వచ్చాం. 29 వేల మంది రైతుల ఉసురు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తగిలి తీరుతుంది” అని అన్నారు.