
పుట్టపర్తి, నవంబర్ 3, (జనస్వరం) : రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు తలెత్తకుండా మార్కెట్ యార్డు సదుపాయాలను వినియోగించుకోవాలని పుట్టపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ పూల శివప్రసాద్ తెలిపారు. కొత్తచెరువు తేరు వద్ద రోడ్డుపైన ఆరబోసిన వరి ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడిన ఆయన, రోడ్లపై ధాన్యం ఆరబోస్తే వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని, ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. రైతుల భద్రత దృష్ట్యా కొత్తచెరువు మార్కెట్ యార్డులో ధాన్యాన్ని నిల్వ ఉంచుకోవడానికి, ఆరబోసుకోవడానికి ఉచిత సౌకర్యాలు కల్పించామని చెప్పారు. యార్డులో ధాన్యం ఉంచితే అది సురక్షితంగా ఉంటుందని రైతులకు సూచించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులు క్షేమంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే రైతుల కోసం వసతి సదుపాయాలు, జీవాల కోసం నీటి తొట్టెలు వంటి మరిన్ని సౌకర్యాలను మార్కెట్ యార్డులో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ప్రధాన కార్యదర్శి హనుమంతు నాయక్, మార్కెట్ యార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.









