
అనంతపురము, ఆగష్టు 12 : ఆరోగ్యవంతమైన పిల్లలే విద్యలో రాణించగలరని ప్రముఖ విద్యావేత్త, రాయలసీమ ప్రజా సమాఖ్య అధ్యక్షులు, కక్కలపల్లి ప్రాథమిక పాఠశాల హెడ్మాష్టర్ గొర్తి వెంకటస్వామి అన్నారు. నులిపురుగుల నివారణతోనే పిల్లలకు మెరుగైన ఆరోగ్యం సాధ్యమన్నారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సి. గౌరీ, వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఇతర కార్యకర్తలు శుక్రవారం పాఠశాలలో విద్యార్థులకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి, నులి పురుగుల నివారణ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా హెడ్మాష్టర్ గొర్తి వెంకట్ మాట్లాడుతూ, పిల్లల్లో నులిపురుగులతో శారీరక, మానసిక ఎదుగుదల మందగిస్తుందన్నారు. తల్లిదండ్రులు పిల్లల శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. గోర్లు పెరగకుండా కత్తిరించాలని, భోజనానికి ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవాలని, మలమూత్ర విసర్జన అనంతరం చేతులు శుభ్రం చేసుకునే విధానం నేర్పించాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే రక్తహీనత, మతిమరుపు లాంటి లక్షణాలు ఉంటాయన్నారు. తినే ఆహారాలపై మూతలు ఉంచాలని, రోడ్ల వెంట అపరిశుభ్రమైన పదార్థాలు తినకూడదని తెలిపారు. అల్బెండజోల్ మాత్రలు వేయడం వల్ల రక్తహీనతను నివారించవచ్చని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో మాత్రలను పంపిణీ చేశామన్నారు. 1 నుంచి 19 ఏళ్ల పిల్లలకు ఆరోగ్య పరిరక్షణ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, పాఠశాల యాజమాన్య కమిటీ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, పిల్లలు, తల్లిదండ్రులు, పాల్గొన్నారు.








