
వాల్మీకిపురం క్రికెట్ మైదానాల్లో డీఈవో సందర్శన క్రీడాకారిణులకు మార్గదర్శకం చేసిన జిల్లా విద్యాశాఖాధికారి.
వాల్మీకిపురం, ఆగస్టు 2( జనస్వరం)
ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ (సీడీసీఏ), ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) సంయుక్త ఆధ్వర్యంలో వాల్మీకిపురంలోని సీడీసీఏ, జీవీఎస్‌సీఎస్ మైదానంలో నిర్వహిస్తున్న సౌత్ జోన్ అండర్-23 మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్‌ను ఆదివారం అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ కె. సుబ్రహ్మణ్యం సందర్శించారు.ఈ సందర్భంగా క్రీడాకారిణులను పరిచయం చేసుకుని వారితో ముచ్చటించిన ఆయన, క్రీడల్లో ప్రతిభను మరింత మెరుగుపరుచుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడలతో పాటు చదువుపై కూడా దృష్టి సారిస్తే ఉన్నత భవిష్యత్తు సాధించవచ్చని సూచించారు. జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావడంతో పాటు జాతీయ జట్టుకు ఎంపికయ్యే స్థాయికి ఎదగాలని ప్రోత్సహించారు.అనంతరం జిల్లా సైన్స్ అధికారి సీడీసీఏ ఉపాధ్యక్షుడు జి. శ్రీధర్ కుమార్ మాట్లాడుతూ జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన పలువురు క్రీడాకారులు స్పోర్ట్స్ కోటా ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందారని తెలిపారు. క్రీడాకారిణులను జిల్లా విద్యాశాఖ అధికారికి పరిచయం చేసి, వారి ప్రతిభ, టోర్నమెంట్ నిర్వహణ వివరాలను వివరించారు.జాతీయ స్థాయి సదుపాయాలతో కూడిన మైదానాలను అందుబాటులోకి తీసుకువచ్చిన జి. శ్రీధర్ కుమార్, సునీల్ కుమార్‌లను జిల్లా విద్యాశాఖ అధికారి ప్రత్యేకంగా అభినందించారు. అలాగే చిత్తూరు జిల్లా హెడ్ కోచ్ సునీల్ కుమార్ పర్యవేక్షణలో టోర్నమెంట్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తున్న తీరును ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో డీసీఈబీ కార్యదర్శి టి. గంగాధరం, సీడీసీఏ కార్యదర్శి సతీష్ యాదవ్, అధ్యక్షుడు శ్రీనివాసమూర్తి, ఉపాధ్యాయులు హర్ష, కిషోర్ కుమార్, గోపి, భాస్కర్ రెడ్డి, మనోజ్, పీడీలు మౌళి, నాగరాజు, నరేష్, మురళి, పవన్, గ్రౌండ్ ఇన్‌చార్జ్ భరత్ కుమార్, జీవీఎస్‌సీఎస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.









