
విజయవాడ, సెప్టెంబర్ 16, జనస్వరం :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి/బోయ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలోని బీసీ సంక్షేమ భవన్‌లో బోర్డు సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కప్పట్రాల బొజ్జమ్మ (సుశీలమ్మ) అధ్యక్షత వహించగా, వాల్మీకి వెల్ఫేర్ JMD శ్రీమతి ఉమాదేవి సమన్వయకర్తగా వ్యవహరించారు.
సమావేశంలో వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడం, వాల్మీకి జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించడం, వాల్మీకి/బోయల సామాజిక–ఆర్థిక స్థితిని బలోపేతం చేసే పథకాల అమలు, అభ్యున్నతి కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. బోర్డు సభ్యులు సమగ్ర చర్చ జరిపి, వాల్మీకి బోయ సమాజ అభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి బోయ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అంకె ఈశ్వరయ్య ముఖ్య అతిథిగా హాజరై, సమాజ అభివృద్ధి కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఇతర డైరెక్టర్లు కూడా హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.








