
పూసపాటిరేగ, అక్టోబర్ 05, (జనస్వరం) : నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి యువత స్వయం ఉపాధి అవకాశాల విస్తరణకు ప్రాధాన్యతనిస్తూ కోనాడ జంక్షన్‌లో క్యూబ్ ఫాషన్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వ్యాపార రంగం యువతకు బలమైన స్థిరత్వాన్ని ఇవ్వగలదని ఆమె వ్యాఖ్యానించారు. ఉద్యోగాల కోసం నిరీక్షించడం కంటే స్వంత వ్యాపారం ప్రారంభించడం భవిష్యత్తుకు మేలని సూచించారు. యువ పారిశ్రామికవేత్తల ధైర్యాన్ని అభినందించిన ఆమె, కొత్త వ్యాపారాల స్థాపనకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. యువత ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తే పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవడం సులభమని తెలిపారు. ఇలాంటి వ్యాపార ప్రారంభాలు ప్రాంతీయ ఉపాధి అవకాశాలను పెంపొందించి నియోజకవర్గ అభివృద్ధికి దోహదం చేస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎన్డీయే నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.








