
కళ్యాణదుర్గం, మార్చి 28 (జనస్వరం) : మానవత్వమే మతమని చాటుతూ ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ బోరంపల్లి గ్రామానికి చెందిన అనారోగ్య బాధితుడికి రెండున్నరేళ్లుగా నిరంతరాయంగా సహాయం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మండలంలోని బోరంపల్లి గ్రామానికి చెందిన మహేంద్ర తీవ్ర లివర్ వ్యాధితో బాధపడుతుండగా, నెలకు సుమారు రూ.12,000 విలువైన మందులు కొనడం ఆ కుటుంబానికి భారమైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న బద్దే నాయక్ అప్పట్లో ఇచ్చిన హామీ ప్రకారం గత రెండున్నర సంవత్సరాలుగా ప్రతి నెల మందులను అందిస్తూ బాధితుడికి ప్రాణాధారంగా నిలుస్తున్నారు. తాజాగా అపోలో ఫార్మసీ సిబ్బంది సమక్షంలో ట్రస్ట్ వైస్ చైర్మన్ సురేష్ కుమార్‌తో కలిసి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఇలాంటి సేవలు అరుదని, కుటుంబ సభ్యులే పట్టించుకోని పరిస్థితుల్లో బద్దే నాయక్ చూపుతున్న మానవతా సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. బాధితుడు కూడా మందులు ఆగితే ప్రాణమే ఆగినట్టేనని ఆవేదన వ్యక్తం చేశాడు. నిరంతరం ప్రజా సేవలో ముందుంటూ ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలు మరెంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని స్థానికులు తెలిపారు.








