వికసిత భారత్ లక్ష్యంగా బడ్జెట్‌ – ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు

– బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర మీడియా ఇంచార్జ్,
పి రామాంజనేయ ప్రసాద్

అనంతపురము పిబ్రవరి 02, జనస్వరం :  ప్రధాని శ్రీ. నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్–2026 అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేదిగా ఉందని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర మీడియా ఇంచార్జ్ పి రామాంజనేయ ప్రసాద్ పేర్కొన్నారు. బడ్జెట్‌పై స్పందించిన ఆయన ఈ బడ్జెట్ వికసిత భారత్ నిర్మాణానికి మార్గనిర్ధేశం చేస్తుందన్నారు.. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళల అభివృద్ధి, పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో మొత్తం ఖర్చు సుమారు 53.47 లక్షల కోట్లుగా నిర్ణయించడం చారిత్రాత్మకం అన్నారు.. ఈ బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజల అవసరాలు, రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించబడిందని అభిప్రాయపడ్డారు. వేతన జీవులకు కొత్త పన్ను విధానంలో పన్ను రహిత పరిమితిని రూ. 12 లక్షల నుంచి రూ. 12.75 లక్షలకు పెంచడానికి మధ్యతరగతికి గొప్ప వరంగా పేర్కొన్నారు.. అలాగే మౌలిక సదుపాయాలకు రూ.12.2 లక్షల కోట్లు కేటాయించడాన్ని ఆయన ప్రశంసించారు. విద్యారంగంలో మౌలిక సదుపాయాల విస్తరణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా యువతకు భవిష్యత్ అవకాశాలు పెరుగుతాయని అన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి రైతుల ఆదాయం పెంచేలా, సాగునీటి వసతులు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. మహిళల సాధికారత కోసం స్వయం ఉపాధి, స్టార్టప్‌లు, ఆర్థిక భద్రతకు తోడ్పడే పథకాలకు బడ్జెట్‌లో ప్రత్యేక స్థానం కల్పించడాన్ని ఆయన స్వాగతించారు. పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీ కేటాయింపులు చేయడం వల్ల దేశవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఐటి రంగం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, డేటా సెంటర్లు, సెమీకండక్టర్ తయారీ వంటి రంగాలకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా భారత్‌ను టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా బడ్జెట్ ముందుకెళ్లిందన్నారు. అలాగే ఔషధ, ఫార్మా రంగంలో పరిశోధన, తయారీ, ఎగుమతులకు మద్దతు ఇవ్వడం వల్ల ఈ రంగం మరింత వేగంగా ఎదుగుతుందని అన్నారు.. ఔషధ రంగానికి ఈ బడ్జెట్‌లో ప్రత్యేక ప్రాధాన్యాన్ని కల్పిస్తూ “బయోఫార్మా శక్తి” పేరిట 10,000 వేల కోట్ల ప్రాజెక్టును 5 సంవత్సరాల పాటు అమల్లో పెట్టి భారత్‌ను జీవ-ఔషధ పరిశ్రమలో గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోవడం చాలా మంచి విషయం అన్నారు పి రామాంజనేయ ప్రసాద్, అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయానికొస్తే, రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, పోర్టులు, రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు బడ్జెట్ ద్వారా మరింత ఊతం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఫార్మా హబ్‌లు, ఐటి పార్కులు, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగి యువతకు ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా అందుతాయని తెలిపారు. మొత్తంగా యూనియన్ బడ్జెట్–2026 దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేలా, అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించబడిందని, ఇది అభివృద్ధి దిశగా మరో బలమైన అడుగుగా నిలుస్తుందని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పి రామాంజనేయ ప్రసాద్ అభివర్ణించారు.

See also  అధికారిక వేదిక పైన ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని విమర్శించడం ఎంతవరకు సబబు?