తిరుమల లడ్డూ కల్తీపై వైసిపీ పార్టీపై బాల్యం రాజేష్ ఫైర్

కళ్యాణదుర్గం, ఫిబ్రవరి 6, (జనస్వరం) : గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని, ఇది మహాపాపమని కళ్యాణదుర్గం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ బాల్యం రాజేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. జనసేన పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదని సిట్ నివేదిక స్పష్టంగా చెబుతోందన్నారు. జంతు కొవ్వు లేదని ఎక్కడా పేర్కొనకపోవడం, రసాయనాలు మరియు పామాయిల్‌తో తయారైన నూనెను వినియోగించారనే అంశాలు స్పష్టంగా బయటపడ్డాయని తెలిపారు. రూ.400కి కిలో నాణ్యమైన నువ్వుల నూనె కూడా దొరకని పరిస్థితిలో ఆవు నెయ్యి ఎలా సరఫరా చేశారో వైసీపీ సమాధానం చెప్పాలన్నారు. ఐదేళ్ల పాలనలో 1.61 కోట్ల కిలోల నెయ్యి కొనుగోలు చేస్తే అందులో 60 లక్షల కిలోలు కల్తీ నెయ్యి తేలిందని, దాంతో సుమారు 20 కోట్ల లడ్డూలు తయారు చేసి శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. కాసుల కోసం తిరుమలలో అపచారం చేశారని, నిబంధనలు అడ్డగోలుగా మార్చి టన్నుల కొద్దీ కల్తీ నెయ్యి కొనుగోలు చేశారని విమర్శించారు.

ఈ అంశాలు వెలుగులోకి వస్తుండటంతో వైసీపీ నేతలు భయపడి డైవర్ట్ రాజకీయాలకు దిగుతున్నారని బాల్యం రాజేష్ ఆరోపించారు. ఎన్‌డీడీబీ నివేదికలో కల్తీ ఆనవాళ్లు ఉన్నట్లు తేలడంతోనే ప్రభుత్వం విచారణ చేపట్టిందని, దోషులను చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు. ఫ్లెక్సీలు వేసి ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తే గగ్గోలు పెడుతున్నారంటే వైసీపీకి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి రాని నాయకులు బాధ్యత గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాల దిశగా ముందుకు సాగుతుందని, యువతకు ఉపాధి, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పాలన సాగుతుందని తెలిపారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించే కుట్రపూరిత రాజకీయాలను కట్టడి చేస్తామని, రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు. ఈ ప్రెస్ మీట్‌లో జనసేన నాయకులు అనిల్ పాళ్యం, రమేష్, అశోక్, నాగభూషణ, వన్నూరుస్వామి తదితరులు పాల్గొన్నారు.

See also  అనంతపురం అర్బన్ : జనసేన పార్టీలోకి భారీ చేరికలు