
– చిన్నారుల రక్షణకు పోక్సో చట్టం
– టెక్నాలజీతో రక్షణ శక్తి యాప్ ప్రాధాన్యం
అనంతపురం, ఏప్రిల్ 23, (జనస్వరం) : మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో అనంతపురం పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ పి. జగదీష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు శక్తి యాప్, స్త్రీ రక్ష పోర్టల్ ద్వారా వెంటనే సహాయం పొందే విధానాన్ని ఎస్పీ వివరించారు. బాల్య వివాహాల దుష్ప్రభావాలు, పోక్సో చట్టం అమలు గురించి వివరించి, చిన్నారుల హక్కుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ అరెస్ట్, లోన్ యాప్ మోసాలు, ఓటీపీ ఫ్రాడ్‌లపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మహిళలపై నేరాలు గతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టాయని తెలిపారు. ఈ సందర్భంగా మహిళా సభ్యురాలు రాగి రాధిక మాట్లాడుతూ విద్యార్థులు సోషల్ మీడియా యాప్స్ వినియోగంలో మంచి–చెడును గుర్తించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. సోషల్ మీడియాను వినోదంతో పాటు జ్ఞానం, అభివృద్ధికి ఉపయోగించుకోవాలని చెప్పారు. అలాగే, ఏ సమస్య వచ్చినా తల్లిదండ్రులతో పంచుకోవాలని, జీవితంలో నిజమైన మార్గదర్శకులు తల్లిదండ్రులేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వి. శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు పద్మజ, అడ్వకేట్ శశికళ, మహిళా సభ్యులు, విద్యార్థినులు పాల్గొన్నారు.









