
– కేవీకే రెడ్డిపల్లి శాస్త్రవేత్తల సూచనలు
– పంటల సంరక్షణ, బీమాపై అవగాహన కార్యక్రమాలు
అనంతపురం, ఆగస్టు 3 (జనస్వరం): ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు అనుసరించాల్సిన సాగు విధానాలు, పంటల సంరక్షణ చర్యలపై కేవీకే రెడ్డిపల్లి శాస్త్రవేత్తల బృందం చియ్యేడు, ఇటుకలపల్లె, మన్నిల, కందుకూరు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ, కంది పంటలో ప్రస్తుతం నెలకొన్న ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించేందుకు లీటరు నీటికి 5 గ్రాముల పొటాషియం నైట్రేట్, 3 గ్రాముల బోరాన్ మిశ్రమాన్ని కలిపి ఎకరానికి 200 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేయాలని సూచించారు. కంది, ఆముదం పంటల్లో అధిక సాంద్రత ఉన్న మొక్కలను తొలగించి, మొక్కల మధ్య సుమారు 20 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలని తెలిపారు. విత్తిన 30, 60 రోజుల తర్వాత గుంటక లేదా గొర్రుతో అంతరకృషి చేయడం ద్వారా కలుపు నివారణతో పాటు నేలలో తేమను సంరక్షించవచ్చని వివరించారు. ఆగస్టులో వర్షాలు కురిసిన అనంతరం తేలికపాటి నేలల్లో జొన్న, కొర్ర, సజ్జ, పెసర, అలసంద, మేత జొన్న, ఉలవలు వంటి పంటల సాగుకు రైతులు సిద్ధంగా ఉండాలని సూచించారు. అలాగే వాతావరణ ఆధారిత పంటల బీమా (WBCIS), ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) పథకాలలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, నీటి వినియోగంలో మితవ్యయం పాటించి భూమిలో తేమ నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ఆంజనేయులు సూచించారు. కార్యక్రమంలో ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ నారాయణస్వామి, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ సుధారాణి, డాక్టర్ కిషోర్, డాక్టర్ సుస్మిత, డాక్టర్ కవిత, రైతు సేవా కేంద్రం సిబ్బంది జయచంద్ర, భరత్, లిఖిత, మల్లికార్జునతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.









