
భట్టిప్రోలు, నవంబర్ 13, (జనస్వరం) : తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించిన విషయంపై వెంటనే చర్యలు తీసుకుని బాధ్యులైన వారిని అరెస్టు చేయాలని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి సోమరవుతు అనురాధ డిమాండ్ చేశారు. గురువారం భట్టిప్రోలు లో విలేకరులతో మాట్లాడుతూ 70 లక్షల కిలోల కల్తీ నెయ్యి లడ్డూలో కలపడం ద్వారా హిందూ భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. అప్పటి ప్రభుత్వ అధీనంలో ఈ ఘటన జరిగిందని, ఆ సందర్భంలో బాధ్యతలు వహించిన మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మరెడ్డి తో పాటు అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. తిరుమల వంటి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన క్షేత్రంలో పక్కా ప్రణాళికతో కల్తీ చేయడం హిందూ మతంపై పెద్ద కుట్రేనని అనురాధ ఆరోపించారు. మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వైయస్సార్సీపీ వ్యవహరించిందని, దేశాన్ని అస్థిరం చేసే చర్యలకు పాల్పడిందని ఆమె విమర్శించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తక్షణమే జోక్యం చేసుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.








