కాపు భవన్‌కు మరో కోటి విరాళం.. నారాయణ కుటుంబం ఉదారత

నెల్లూరు, మార్చి 17, (జనస్వరం) : కాపు సమాజ అభ్యున్నతికి అంకితభావంతో ముందుకు సాగుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా కాపు భవన్ అభివృద్ధి కోసం మరో కోటి రూపాయల విరాళం అందించబడింది. మాజీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కుటుంబం తరఫున ఆయన అల్లుడు పునీత్ జిల్లా కలెక్టర్‌కు ఒక కోటి రూపాయల చెక్కును అందజేశారు. కాపు సమాజ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే కాపు భవన్ నిర్మాణానికి ఇది మరొక కీలక ముందడుగు కావడం విశేషం. ఇప్పటికే కాపు భవన్ నిర్మాణం కోసం మూడున్నర ఎకరాల స్థలం కేటాయించడంతో పాటు గతంలో ఒక కోటి రూపాయల విరాళాన్ని కూడా నారాయణ అందించిన విషయం తెలిసిందే. అదే సేవా స్పూర్తిని కొనసాగిస్తూ మరోసారి భారీ విరాళం అందించడం పట్ల పలువురు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు వస్తున్న ఇలాంటి దాతృత్వం భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు అతీతంగా సమాజ సేవ చేయడం ద్వారానే నిజమైన నాయకత్వం వెలుగులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పునీత్, కిషోర్ గునుకుల, పోతురాజు అనిల్, గాదిరాజు అశోక్, భూపతి విజయ్ కుమార్, పులి శ్రీనివాస్, సూరిశెట్టి గాయత్రి, బివి శ్రీనివాసులు, విజేత తదితరులు పాల్గొన్నారు.

See also  టీజేఏ వార్షికోత్సవం.. 46 మంది విద్యార్థులకు నోట్‌బుక్కులు, పెన్నుల పంపిణీ