
కుమిలి, అక్టోబర్ 19, (జనస్వరం) : పుసపాటిరేగ మండలం కుమిలి గ్రామంలో అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల నియోజకవర్గ శాసనసభ్యురాలు లోకం నాగ మాధవి పాల్గొన్నారు. అర్హత కలిగిన రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ₹5,000 మరియు కేంద్రం నుండి ₹2,000 చొప్పున మొత్తం ₹7,000 నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. 2025–26 సంవత్సరానికి రైతులకు మొత్తం ₹20,000 ఆర్థిక సహాయం అందుబాటులో ఉంటుందని మాధవి పేర్కొన్నారు. అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, లబ్ధిదారులకు నిధులు నిరంతరం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
నెల్లిమర్ల నియోజకవర్గంలో రెండవ విడత కింద మొత్తం 27,603 మందికి ₹17.90 కోట్లు విడుదలయ్యాయని అధికారులు వివరించారు. మండలాల వారీగా నెల్లిమర్లలో 6,414 మందికి ₹4.25 కోట్లు, పుసపాటిరేగలో 8,705 మందికి ₹5.71 కోట్లు, డెంకాడలో 6,932 మందికి ₹4.50 కోట్లు, భోగాపురంలో 5,552 మందికి ₹3.44 కోట్లు జమ చేయబడినట్లు వెల్లడించారు. నిధులు అందుకున్న రైతులు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, ప్రజా ప్రతినిధులకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








