
భోగాపురం, అక్టోబర్ 29, (జనస్వరం) : ఇటీవలి ‘మోంథా’ తుఫాను కారణంగా భోగాపురం మండలం పరిధిలోని రాజాపులోవ హైవేపై నీరు నిల్వ ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో నెల్లిమర్ల శాసనసభ సభ్యురాలు లోకం నాగ మాధవి ఈరోజు సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఆమెతో పాటు ఎంపీడీఓ, స్పెషల్ ఆఫీసర్, ఇరిగేషన్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. హైవేపై నీటి నిల్వకు కారణమైన ప్రాంతాలను ఆమె పరిశీలించారు. పరిశీలనలో హైవే పక్కన అక్రమంగా నిర్మించిన గోడ కారణంగా నీటి ప్రవాహం ఆగిపోతుందని అధికారులు గుర్తించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వెంటనే యంత్రాల సహాయంతో ఆ అక్రమ గోడను తొలగించారు. అలాగే సమీపంలో ఉన్న చెరువు కూడా అక్రమణకు గురైనట్లు గుర్తించడంతో, అది కూడా నీటి నిల్వకు కారణమని అధికారులు వెల్లడించారు. ఈ విషయమై ఎమ్మెల్యే నాగ మాధవి చెరువు అక్రమణపై సమగ్ర విచారణ జరపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా హైవేపై నీటి నిల్వ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అధికారులు వేగవంతమైన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.








