
అనంతపురం, అక్టోబర్ 4 (జనస్వరం): రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అరవింద్ నగర్-1, అరవింద్ నగర్-2, ఓబుల్ దేవ్ నగర్, అశోక్ నగర్ ప్రాంతాల ఆధ్వర్యంలో ఉత్సవ ముగింపు సభను అరవింద్ నగర్ జిమ్ పార్క్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవిశంకర్, విభాగ ప్రముఖ్ రాజగోపాల్ జీ, నగర వ్యవస్థా ప్రముఖ్ నాగేంద్ర యాదవ్, అరవింద్ నగర్ విభాగ్ ప్రముఖ్ తదితరులు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ దేశంలోని నేటి యువతను ఒక తాటిపైకి తీసుకురావడంతో పాటు జాతీయ ఐక్యత, జాతీయవాదాన్ని పెంపొందించేందుకు ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంస్థలు నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపారు. స్వయంసేవకుడిగా పనిచేయడం కష్టతరమైన మార్గమైనప్పటికీ, కొంతమంది తమ జీవితాలను జాతి అభివృద్ధికి అంకితం చేస్తున్నారని పేర్కొన్నారు. నేటి యువత మంచి భవిష్యత్తు కోసం శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకుని, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఆలోచనలు పెంచుకోవాలని, విద్యార్థి దశ నుంచి జీవితాంతం తన కుటుంబం, సమాజం, దేశం కోసం పనిచేసే విధంగా తయారుకావాలని పిలుపునిచ్చారు. రాజగోపాల్ జీ మాట్లాడుతూ నేటి యువత అన్ని రంగాల్లో చురుకైన ప్రతిభను కనబరుస్తోందని, ప్రతి ఒక్కరూ జాతీయవాద భావాలను పెంపొందించుకోవాలని సూచించారు. నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యర్థి దేశాలు భారతదేశాన్ని ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు చేస్తున్నాయని, యువతను పక్కదారి పట్టించే విధంగా సోషల్ మీడియాలో విషప్రచారం, కల్పిత ప్రచారాలు జరుగుతున్నాయని అన్నారు. విద్యార్థులు సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలను వాస్తవ దృక్కోణంలో తెలుసుకుని దేశ భవిష్యత్తు కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాజకీయ నాయకుల ప్రభావానికి లోనుకాకుండా దేశ అభివృద్ధి కోసం పనిచేసే నాయకత్వంలో నడిచి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు. విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ చిన్నతనం నుంచే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యక్రమాల్లో పాల్గొంటూ, విశ్వ హిందూ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడిగా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నానని తెలిపారు. భవిష్యత్తులో మరింత కార్యదీక్షతో ప్రజలను సరైన మార్గంలో నడిపించేందుకు కృషి చేస్తానని, ఆర్‌ఎస్‌ఎస్ 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలు ముగియడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ ముఖ్య నాయకులు బాబయ్య, ఆర్.వి. ప్రసాద్, చక్రధర్ యాదవ్, కోనయ్య తదితరులతో పాటు వందలాది మంది విద్యార్థులు, ప్రజలు పాల్గొని ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.









