
సమాజ సేవలో యువత భాగస్వాములు కావాలి – పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ మెదరమెట్ల రామ శేషగిరిరావు.
నరసరావుపేట, ఫిబ్రవరి 26( జనస్వరం)
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి యూత్ రెడ్ క్రాస్ శిక్షణ శిబిరంలో జిల్లా చైర్మన్ మెదరమెట్ల రామ శేషగిరిరావు ముఖ్య ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన రెడ్ క్రాస్ యొక్క విశిష్టతను మరియు యువత పాత్రను వివరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.రెడ్ క్రాస్ అనేది కేవలం ఒక జిల్లాకో, రాష్ట్రానికో పరిమితమైన సంస్థ కాదని, ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అతిపెద్ద సేవా సంస్థ అని ఆయన కొనియాడారు. సింగపూర్, యూరప్, అమెరికా ఇలా ఎక్కడికి వెళ్లినా రెడ్ క్రాస్ తన సేవల ద్వారా ప్రజల మన్ననలు పొందుతోందని గుర్తు చేశారు. తుపాన్లు, అగ్నిప్రమాదాలు వంటి విపత్తులు సంభవించినప్పుడు సామాన్యులకు అండగా నిలబడేది రెడ్ క్రాస్ వాలంటీర్లేనని, విపత్తు నిర్వహణ అంటేనే రెడ్ క్రాస్ అనే స్థాయికి సంస్థ ఎదిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్ క్రాస్ చైర్మన్ Y. D రామారావు, స్టేట్ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ BVS కుమార్ , పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ KMNV శ్రీనివాస గుప్తా, ట్రెజరర్ డాక్టర్ నంద్యాల రాంప్రసాద్ రెడ్డి,సెక్రటరీ డాక్టర్ చంద్రశేఖర్,మేనేజింగ్ కమిటీ మెంబర్ బత్తుల మురళి మరియు రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి వచ్చిన యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లకు ఈ శిబిరం ద్వారా నాయకత్వ లక్షణాలు (Leadership Qualities) మరియు సేవా దృక్పథాన్ని అలవర్చడమే తమ ప్రధాన సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులతో పోలిస్తే, రెడ్ క్రాస్ ద్వారా అత్యంత నాణ్యమైన, కల్తీ లేని రక్తాన్ని రోగులకు అందిస్తున్నామని చెప్పారు.ముఖ్యంగా తలసేమియా వ్యాధితో బాధపడుతూ రక్తం పునరుత్పత్తి కాక ఇబ్బంది పడే చిన్నపిల్లలకు రెడ్ క్రాస్ ఉచితంగా రక్తాన్ని అందిస్తూ ప్రాణదాతగా నిలుస్తోందని వివరించారు. వృద్ధాశ్రమాలు, శిశు గృహాల నిర్వహణ, అన్నదానం మరియు ఉచిత వైద్య శిబిరాల ద్వారా రెడ్ క్రాస్ సమాజంలోని ప్రతి వర్గానికి చేరువవుతోందని ఆయన పేర్కొన్నారు. సమాజం నుండి మనం ఎంతో పొందుతున్నామని, తిరిగి సమాజానికి ఎంతో కొంత ఇచ్చే క్రమంలో రెడ్ క్రాస్ ఒక అద్భుతమైన వేదిక అని శేషగిరిరావు అన్నారు.

ఈ సంస్థలో భాగస్వాములైన వాలంటీర్లందరూ గర్వంగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.








