బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వ భరోసా

మత్స్యకార

నెల్లిమర్ల/విజయనగరం, జనవరి 11, (జనస్వరం) : బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చిక్కుకున్న ఉత్తరాంధ్ర మత్స్యకారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చింది. ఆదివారం నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలోని బాధిత మత్స్యకార కుటుంబాలను నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, రాష్ట్ర MSME, సెర్ప్ మరియు ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా విజయనగరం ఆర్డీవో, అధికారులు, స్థానిక మత్స్యకార నాయకులతో కలిసి బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం మరియు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. ప్రభుత్వం తరపున బంగ్లాదేశ్ చెరలో ఉన్న మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఒక్కో కుటుంబానికి రూ.30,000 చొప్పున మొత్తం తొమ్మిది మంది లబ్ధిదారులకు సహాయక చెక్కులను అందజేశారు. అలాగే ప్రతి కుటుంబానికి బియ్యం, పప్పులు, నూనె వంటి నిత్యవసర వస్తువులు పంపిణీ చేసి ధైర్యం చెప్పారు. విదేశాంగ శాఖతో నిరంతరం సంప్రదింపులు కొనసాగుతున్నాయని, మత్స్యకారులు సురక్షితంగా స్వదేశానికి చేరుకునేలా ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎమ్మెల్యే లోకం నాగ మాధవి మాట్లాడుతూ పరాయి దేశంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వారి కుటుంబాలకు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయని, వారు తిరిగి వచ్చే వరకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఆర్డీవో, స్థానిక తహశీల్దార్, మత్స్యకార సంఘాల ప్రతినిధులు, లబ్ధిదారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

See also  జనసైనికుడి కుటుంబానికి ఎమ్మెల్యే లోకం మాధవి ఆర్థిక సహాయం