గంజాయి వ్యతిరేక పోరాటానికి జనసేన సంపూర్ణ మద్దతు : గునుకుల కిషోర్

నెల్లూరు, డిసెంబర్ 2, (జనస్వరం) : గంజాయి ముఠా లీడర్ కామాక్షి బయటికి వస్తే కామ్రేడ్ పెంచలయ్య జీవితం వ్యర్థమవుతుందని, గంజాయి వ్యతిరేక పోరాటాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్తామని జనసేన నాయకులు స్పష్టంచేశారు. పెంచలయ్య కుటుంబానికి అండగా నిలబడి వారి సంకల్పానికి పూర్తిగా జనసేన మద్దతుగా ఉంటుందని పార్టీ నాయకులు తెలిపారు. గంజాయి ముఠా దాష్టికానికి బలైన కామ్రేడ్ పెంచలయ్య కుటుంబాన్ని మంగళవారం నాడు ఆర్.డి.టి.డి కాలనీలోని వారి నివాసంలో జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గంజాయి సమస్యను పూర్తిగా రూపుమాపే శక్తి పవన్ కళ్యాణ్‌కే ఉందన్న కుటుంబ సభ్యుల అభీష్టాన్ని పార్టీ అధిష్టానానికి తెలియజేస్తామని చెప్పారు. బాధితుల కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాలపై పెద్దలతో చర్చిస్తామని, ఎలాంటి బెదిరింపులకు భయపడవద్దని తెలిపారు. పెంచలయ్య ఆశయాలను ముందుకు నడిపేందుకు జనసేన పార్టీ కలిసి సాగుతుందని ఆయన భరోసా ఇచ్చారు. యువత గంజాయి బారిన పడి భవిత కోల్పోకుండా ఉండాలన్న లక్ష్యంతో గంజాయి మహమ్మారిని మట్టుపెట్టాలన్న సంకల్పం కొనసాగుతుందని పేర్కొన్నారు.పెంచలయ్య భార్య మాట్లాడుతూ, తమ కుటుంబం కోసమే కాకుండా సమాజం మంచికోసం ఆయన పోరాడారని చెప్పారు. యువత బాగా చదివి సమాజాన్ని ఉద్ధరించాలన్న ఆశయంతోనే ఆయన ముందుకు సాగేవారని వెల్లడించారు. ఆ లక్ష్యాన్ని పవన్ కళ్యాణ్ కొనసాగించాలని ఆమె కోరారు. గంజాయి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన తమ తండ్రి ఆశయం నెరవేరాలని కుమారులు ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సుధాకర్ ఆత్మకూరి, ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, నరహరి, వర్షన్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

See also  అచ్చుతాపురంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం: ప్రజా సంఘాలు