సమగ్ర వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన పెంచుకోవాలి – ఎమ్మెల్యే మాధవి

విజయనగరం, నవంబర్ 26, (జనస్వరం) : ప్రతి రైతు సమగ్ర వ్యవసాయ విధానాలపై సరైన అవగాహన కలిగి ఉండాలని నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం నాగ మాధవి అన్నారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏరువాక కేంద్రం విజయనగరం ఆధ్వర్యంలో, ఆత్మ విజయనగరం సహకారంతో డెంకాడ పాణిరాజు పొలంలో రబీ పంటలలో కీలక యాజమాన్య పద్ధతులపై రైతులు–శాస్త్రవేత్తల చర్చాగోష్టి మరియు రైతు సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రైతులతో ముచ్చటించి, వ్యవసాయం చేస్తూ ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. డెంకాడ కే.వి. సూర్యనారాయణ రాజు పొలంలో ఏర్పాటు చేసిన చిరు సంచులను పరిశీలించి, ప్రస్తుత పంటలకు తగిన సాంకేతిక యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా ఖర్చులు తగ్గించి అధిక దిగుబడి సాధించవచ్చని సూచించారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. పంటలతో పాటు పశుపోషణ, కోళ్ల పెంపకం వంటి అనుబంధ రంగాలను సమగ్రంగా చేపడితే వ్యవసాయ ఆదాయం మరింత పెరుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు ఆధునిక సాగు విధానాలు, రబీ పంటల యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. ఆత్మ పథక సంచాలకురాలు అనురాధ మాట్లాడుతూ రైతులు శిక్షణా కార్యక్రమాలు, అధ్యయన పర్యటనలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం మరియు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, డెంకాడ మండల రైతులు, వ్యవసాయ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

See also  ప్రజలనుండి వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ : జైలునుంచి వచ్చిన నాయకుడు జగన్