ప్రత్యేక మండలానికి ఎస్.టి కమిషన్ చైర్మనుకు వినతి

శంఖవరం, నవంబర్ 23 (జనస్వరం) ; కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఉప ప్రణాళిక ప్రాంతం (నాన్ షెడ్యూల్డు ఏరియా)లోని శంఖవరం మండలం పెదమల్లాపురం కేంద్రంగా ప్రత్యేక గిరిజన మండలాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎస్.టి కమిషన్ చైర్మను ఎస్.బొజ్జిరెడ్డికి గిరిజనులు వినతి పత్రాన్ని సమర్పించారు. మండలంలోని అన్నవరంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని ఆదివారం ఉదయం ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని పెదమల్లాపురం ప్రత్యేక గిరిజన మండలం సాధన సమితి పెద్దలు కొందరు కలిసి ఈ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ నియోజకవర్గంలోని శంఖవరం, ప్రత్తిపాడు, రౌతులపూడి, కోటనందూరు, ఏలేశ్వరం మండలాల్లోని 13 గిరిజన గ్రామ పంచాయితీల పరిధిలోని 59 ఆదివాసీ గ్రామాలను కలపి పెదమల్లాపురం కేంద్రంగా ప్రత్యేక గిరిజన మండలాన్ని ఏర్పాటు చేయాలని, ఈ విజ్ఞప్తిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్ళాలని గిరిజనులు కోరారు. అలాగే భారత రాజ్యంగం కల్పించిన హక్కులు అన్నింటినీ ఈ ప్రత్యేక మండలంలోని ఆదివాసీలు, ఆదివాసీ తెగల ప్రజలు అందరికీ అమలు చేయాలని, సుధీర్ఘ కాలంగా గిరిజనలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, మా ఆదివాసీలకు తగు న్యాయం చేయాలనీ గిరిజనులు వివరించారు.‌ ఇందుకు సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ఎస్.టి కమిషన్ చైర్మను ఎస్.బొజ్జిరెడ్డి ఈ విషయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇచ్చారు.

See also  యలమంచిలి మండల ప్రైవేట్ (బడ్జెట్) విద్యా సంస్థల సమావేశం