పుస్తక పఠనంతోనే మెరుగైన భవిత : ఘనంగా గ్రంథాలయ వారోత్సవాల ముగింపు

తిరుపతి, నవంబర్ 21, జనస్వరం :
నిరంతర పుస్తక పఠనంతోనే మెరుగైన భవిత సాధ్యమని ప్రముఖ సాహితీవేత్త, ఏపీ గ్రంథాలయ పరిషత్ సభ్యులు డాక్టర్ రాసాని వెంకట్రామయ్య అన్నారు. శుక్రవారం స్థానిక అన్నమయ్య సర్కిలోని తిరుపతి గ్రేడ్- 1 గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి జె. శివప్రసాద్ ఆధ్వర్యంలో 58వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు, విద్యార్థిని, విధ్యార్థులకు బహుమతుల ప్రదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ సభ్యులు డా. రాసాని వెంకట్రామయ్య, ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆర్.వి.యస్.యస్. శర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ పూర్వ సభ్యులు, శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర అధ్యక్షులు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు సభాధ్యక్షత వహించారు. ఈ సందర్భముగా ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. రాసాని వెంకట్రామయ్య మాట్లాడుతూ, పుస్తక పఠనంతోనే మెరుగైన భవిత సాధ్యమన్నారు. కవులు, రచయితలు అనధికారిక శాసనకర్తలన్నారు. పౌర గ్రంథాలయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పుస్తకాలు మంచి ఆలోచనలను పెంపొందిస్తాయన్నారు. విద్యార్థులు నైతిక విలువలను అలవర్చుకోవాలన్నారు. యువశక్తిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మంచి సాహిత్యమే మంచి సమాజాన్ని నిర్మిస్తుందన్నారు. జ్ఞాన సంపదను పెంచుకోవడానికి మాత్రమే సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు. పోటీ పరీక్షలలో విజయం సాధించేందుకు గ్రంథాలయాలు అభ్యర్థులను తీర్చి దిద్దుతాయన్నారు. ప్రతి రోజు గ్రంథాలయాన్ని సందర్శించే వారి జీవితంలో పెనుమార్పులు సాధ్యమన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆర్.వి.యస్.యస్. శర్మ మాట్లాడుతూ, పుస్తక పఠనం జీవితాన్ని సంస్కరిస్తుందన్నారు. విజేతల ఆత్మకథలు పాఠకులకు స్పూర్తి నింపుతాయన్నారు. “చదవడం నా కిష్టం” అనే కార్యక్రమాన్ని జిల్లా లోని అన్ని గ్రంధాలయాల్లో క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు. గ్రంథాలయలు మన జీవన గమనానికి బృందావనాలని, విజ్ఞాన వికాసాలకు పునాదులన్నారు. పుస్తక పఠనానికి ఉన్నంత ప్రాధాన్యత దేనికీ లేదన్నారు. అలాంటి పుస్తక పఠనానికి మార్గం సుగమం చేసేవి గ్రంథాలయాలన్నారు. వీటిని విజ్ఞాన కేంద్రాలుగా కూడా పిలుస్తుంటారని, ప్రతి పోటీ పరీక్షకు తర్ఫీదు అయ్యేందుకు గ్రంథాలయంలో తగిన పుస్తకాలు లభ్యమవుతాయన్నారు. సభాధ్యక్షులు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు, ప్రజా కళావేదిక అధ్యక్షులు అరవ జయపాల్ మాట్లాడుతూ, విద్యార్థులే దేశ సంపదన్నారు. విద్యార్థుల అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తుందన్నారు. గ్రంథాలయాలు విజ్ఞానాన్ని పంచే భాండాగారాలన్నారు. గ్రంథాలయాలు ఎందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దే సరస్వతీ నిలయాలన్నారు. ఇక్కడ విజ్ఞానాన్ని పెంపొందింపజేసుకుని ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. తదనంతరం గ్రంధాలయ వారోత్సవాల సందర్భంగా యం.ఆర్ పల్లి, కృష్ణ రెడ్డి చైతన్య, భాష్యం హై స్కూల్, జి.యస్.ఆర్. మాగ్నెట్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ పాఠశాలలోని విద్యార్ధులకు నిర్వహించిన వ్యాసచన, చిత్రలేఖనం, పాటల పోటీలలో గెలుపొందిన విద్యార్థినీ, విద్యార్ధులకు బహుమతుల ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర అధ్యక్షులు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు, ప్రజా కళావేదిక వ్యవస్థాపకులు అరవ జయపాల్, ఉయ్ సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు, ఇంపాక్ట్ క్లబ్ రీజనల్ ప్రెసిడెంట్ తహసున్నిస బేగం, కవి డా. సోము ఉమాపతి, క్రిష్ణా రెడ్డి చైతన్య, హైస్కూల్ విద్యార్థిని విధ్యార్థులు, గ్రంధాలయ సిబ్బంది జీవన్ గోవిందరాజులు, విశ్వప్రసాద్, గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు.

See also  హిందుత్వం అనేది ఒక జీవన విధానం : పిఠాపురం జనసేన ఇంచార్జ్ మాకినీడు శేషుకుమారి