
అనంతపురం, అక్టోబర్ 15, జనస్వరం : వెనుకబడిన రాయలసీమ జిల్లాలలో హైకోర్టును ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి న్యాయవాది పేరూరు నాగిరెడ్డి గూడెం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పై విధంగా కోరారు. దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాలలో రాయలసీమ జిల్లాలకు ఎటువంటి ప్రాధాన్యత లభించడం లేదని, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు సమన్యాయం చేసేలా మూడు రాజధానులు ప్రతిపాదించినట్లు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే విధంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. నేడు కర్నూలుకు విచ్చేయనున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి కర్నూలులో హైకోర్టును పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి రాయలసీమ వెనుకబాటుకు తోడ్పాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం కేవలం అమరావతి చుట్టుపక్కల అభివృద్ధిని పరిమితం చేస్తోందని ఆయన తెలిపారు.
రాయలసీమకు ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ఇస్తున్నందున ఇక్కడ హైకోర్టును ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమ జిల్లాలలో ఎటువంటి పరిశ్రమలు గాని, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు గాని ఏర్పాటు చేయలేదని, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రకటించిన హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోనూ కలిసి పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక చొరవ తీసుకుని హైకోర్టు ఏర్పాటుకు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కర్నూలులో హైకోర్టు స్థాపించకపోతే భవిష్యత్తులో న్యాయపరమైన పోరాటాలకు సిద్ధం కావాల్సి వస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.








