చల్లపల్లిలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు “కల” నెరవేరేనా? “కల” గానే మిగిలేనా ? :: ఆదివారం జనసైనికుల దీక్ష

చల్లపల్లిలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు “కల” నెరవేరేనా? “కల” గానే మిగిలేనా ? :: ఆదివారం జనసైనికుల దీక్ష

–ఏళ్లు గడుస్తున్నా ప్రారంభంకాని నిర్మాణ పనులు
–వేసవి వచ్చిందంటే వెంటాడుతున్న అగ్గి భయం
–లక్షల రూపాయల ఆస్తి బుగ్గిపాలు
–చల్లపల్లి వాసుల వెతలు తీరేదెన్నడో
                        అవనిగడ్డ నియోజకవర్గానికి కేంద్ర బిందువుగా ఉన్న చల్లపల్లి మండలంలో అగ్నిమాపక కేంద్రం లేకపోవడం వలన ప్రతియేటా అగ్నిప్రమాదాలు జరిగి కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని నష్టపోవాల్సివస్తుంది. ముఖ్యంగా వేసవికాలంలో జరుగుతున్న అగ్నిప్రమాదాల వలన అనేక కుటుంబాలు నిరాశ్రయులు అవుతున్నారు. అగ్నిప్రమాదానికి గురైన గృహాలు, వరిగడ్డి వాములు క్షణాల్లో అగ్నికి ఆహుతి అవుతున్నాయి. కాలి బూడిద అవుతున్నాయి. చల్లపల్లిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంటే ఇటు అవనిగడ్డ నుండి, లేకపోతే అటు మొవ్వ నుండి, అది కూడా లేకపోతే మచిలీపట్నం నుండి అగ్నిమాపక వాహనం రావాల్సిఉంటుంది. అవి సంఘటనా స్థలానికి చేరుకునేందుకు గంటల సమయం పడుతుండటంతో ఈలోగానే ప్రమాదానికి గురైన గృహాలు కాలి బుడిదై ప్రజలు కట్టుబట్టలతో మిగులుతున్నారు. ఈ ప్రాంతంలో అగ్నిమాపక కేంద్రం నిర్మాణానికి నారాయణరావు నగర్ లో స్థలం కేటాయించినప్పటికీ, నిర్మాణం మాత్రం ఆచరణకు నోచుకోలేదు. ఈ సమస్యను పరిష్కరిస్తామని అటు అధికారులు, ఇటు నాయకులు హామీలు ఇవ్వడమే కనిపిస్తుంది కానీ, ఈ విషయంలో చల్లపల్లి మండలం పూర్తిగా నిరాదరణకు గురవుతుంది.
                       అవనిగడ్డ అగ్నిమాపక కేంద్రం గురించి ఒకసారి ఆలోచిస్తే 1978 సంవత్సరంలో అవనిగడ్డ నియోజకవర్గంలోని 5 మండలాలకు సేవలను అందించేందుకు దీనిని ఏర్పాటుచేశారు. అయితే ఇక్కడ కూడా పలు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. మొత్తం 16 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా సుమారు 10 మంది సిబ్బంది మాత్రమే విధులను నిర్వర్తిస్తున్నారు. 5 మండలాలలో ఏ చిన్న సంఘటన చోటుచేసుకున్నా వెంటనే ఘటనా స్థలానికివెళ్ళాల్సిరావడంతో, పరిధి ఎక్కువ కావడంతో సంఘటనా స్థలానికి చేరుకునేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. గతంలో ప్రమాదాలు ఎక్కువగా ఉండేవని, ఈ మధ్యకాలంలో ప్రమాదాల సంఖ్య తగ్గి, ఆస్తి నష్టం తీవ్రం అవుతుందని కొందరు సిబ్బంది తెలిపారు. ప్రమాదాల సంఖ్య కూడా తగ్గడానికి ప్రధానకారణం అగ్నిమాపక కేంద్రం వారు వారోత్సవాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నారు. గ్రామాల్లో మాక్‌డ్రిల్‌ కూడా నిర్వహిస్తున్నారు. కావాల్సిన పరికరాలు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని, తమకు కావాల్సిందల్లా సిబ్బంది నియామకమని తెలిపారు. అటువైపు వెళ్లి మొవ్వ అగ్నిమాపక కేంద్రం గురించి ఒకసారి చూసుకుంటే చల్లపల్లిలో సగం గ్రామాలు, ఘంటసాల, మొవ్వ, పమిడిముక్కల, తోట్లవల్లూరు మండలాల్లో సేవలందించేందుకు 1987లో మొవ్వ కేంద్రంగా అగ్నిమాపక కేంద్రాన్ని నిర్మించారు. ఇక్కడ కూడా సిబ్బంది కొరత బాగా వేధిస్తోంది. ఘంటసాల, చల్లపల్లి మండలాల్లో చివరి గ్రామంలో ఏదైనా అగ్నిప్రమాదం సంభవిస్తే మొవ్వ నుంచి ఫైర్‌ఇంజన్‌ వెళ్ళేసరికి ప్రమాదం భారీగా జరుగుతోంది. చల్లపల్లిలో అగ్నిమాపకకేంద్రం ఏర్పాటుచేయాలని ఎన్నో ఏళ్ళుగా ప్రజలు కోరుతున్నారు. గత ప్రభుత్వం హయాంలో చల్లపల్లి నారాయణరావు నగర్ లో అగ్నిమాపక కేంద్రం నిర్మాణానికి స్థలం కేటాయించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యమో, ప్రజాప్రతినిధుల ఉదాసీనతో తెలియదుగాని నిర్మించలేదు.
                      ఇదిలాఉంటే అగ్నిమాపక వాహనం ట్యాంకులో సుమారు నాలుగువేల లీటర్లు మాత్రమే నీరు ఉంటుంది. అగ్నిప్రమాదం జరిగే ప్రాంతానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ఈ నీటిని ఉపయోగిస్తారు. ట్యాంకు ఖాళీఅయితే దగ్గరలో చెరువులులేక, బోర్లులేక ఫైర్‌ సిబ్బంది ట్యాంకు నింపేందుకు పడే ఇబ్బందులు అన్నీ, ఇన్నీ కావు. గ్రామాల్లో రక్షిత మంచినీటి ట్యాంకు నిర్మించేటప్పుడే ప్రతి గ్రామంలో హైటెండ్‌వాల్‌ను ఏర్పాటుచేయాలనే నిబంధన ఉన్నప్పటికీ వాటిని మాత్రం ఏ పంచాయతీలో అమలుచేయటం లేదు. దీంతో నీటికోసం అగ్నిమాపక సిబ్బంది నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఇకనైనా నాయకులు, అధికారులు పట్టించుకోవాలని జనసేన పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. చల్లపల్లిలో ఫైర్ స్టేషన్ కొరకు జనసేన పార్టీ చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వవలసినదిగా చల్లపల్లి జనసేన పార్టీ నాయకులు కోరుతున్నారు. 

See also  అగ్రవర్ణాల పేదలకు (EWS) 10% రిజర్వేషన్స్ అమలు చేయాలి : ఆళ్ళగడ్డ జనసేన పార్టీ డిమాండ్