
నెల్లూరు సిటీ ( జనస్వరం ) : నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట 210వ రోజున 43వ డివిజన్ చిన్న బజారు అరటి పండ్ల సందు ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగి ప్రజాసమస్యలను అధ్యయనం చేసి పోరాడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో బస్సు యాత్ర చేపట్టనున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సిద్ధం చేసుకున్న పవనన్న రథం “వారాహి”పై, ఆ వాహనం రంగు పై పిచ్చవాగుడు వాగిన రాష్ట్ర మంత్రులకు, వైసీపీ నాయకులకు, ఇప్పుడు వారాహికి ఆర్టీఓ అనుమతులన్నీ రావడంతో చెంపపెట్టు పడినట్లు అయిందని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ గారికి రోజురోజుకీ ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి వైసీపీ కడుపు మంటతో రగిలిపోతోందని, అందుకే అసలు అంశమే కానటువంటి వాహన రంగు పై ఈ బులుగు పచ్చ రంగుల ప్రభుత్వం విమర్శలు గుప్పించిందని అన్నారు. ఇప్పటికైనా మంత్రులు బుద్ధి తెచ్చుకుని ఇలాంటి చిన్న విషయాల మీద కాకుండా రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని కేతంరెడ్డి వినోద్ రెడ్డి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








