ప్రజలకు మరింత చేరువయ్యేలా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పంచాయతీరాజ్ వ్యవస్థ

గుంతకల్, డిసెంబర్ 4, (జనస్వరం) : ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సారథ్యంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో కీలక సంస్కరణలు అమలవుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 77 డివిజనల్ డివలప్మెంట్ ఆఫీస్ (డీడీఓ) కార్యాలయాలను పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో భాగంగా గుంతకల్ పట్టణంలో డీడీఓ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్, గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ, గుమ్మనూరు నారాయణస్వామి, వివిధ శాఖల అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగా డీడీఓ కార్యాలయాలను ప్రారంభించిన అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. డీడీఓ కార్యాలయాల ద్వారా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల సమన్వయం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న అధికారుల పదోన్నతులు పూర్తవుతాయని, ప్రజలకు సులభంగా, సత్వరంగా సేవలందించేందుకు ఈ కార్యాలయాలు ఉపయోగపడతాయని చెప్పారు. నూతన సంస్కరణలతో అధికారులకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించామని పేర్కొన్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర పంచాయతీలకు అవసరమైన సహాయ సహకారాలు అందుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో నిధులను సక్రమంగా వినియోగించే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని అన్నారు. రాష్ట్రంలో సుమారు 70 శాతం గ్రామాలే ఉన్నాయని, గ్రామీణ ప్రజానీకానికి పాలన పరంగా సులభతరం చేయడమే లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం అందించే సంక్షేమం, అభివృద్ధిని గ్రామాలకు పారదర్శకంగా చేరవేయడానికి డీడీఓ కార్యాలయాలు వారధిలా పనిచేస్తాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో వేగంగా పనులు జరిగేలా ఈ కార్యాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, ఒకేసారి 77 డీడీఓ కార్యాలయాల ప్రారంభం రాష్ట్రానికి శుభ సంకేతమని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

See also  వైసీపీ డైవర్ట్ రాజకీయాలు బట్టబయలు అయ్యాయి : జనసేన నాయకులు జగదీష్