కలియుగ వైకుంఠంలో రాక్షసుడి పంజా!

  • భక్తుల విశ్వాసాన్ని కలుషితం చేసిన కల్తీ నెయ్యి కుంభకోణం

కలియుగ వైకుంఠం అనగానే మనకు గుర్తుకు వచ్చేది.. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం. ప్రతి రోజూ లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తారు. ‘‘ఓం నమో వెంకటేశాయ’’ అని పలికిన ప్రతి అక్షరంలో భక్తి నిండిపోయి ఉంటుంది. అలాంటి పవిత్రమైన వైకుంఠాన్ని, భక్తుల విశ్వాసాన్ని కల్తీ నెయ్యితో అపవిత్రం చేసిన ఘోరమైన నేరం వెలుగులోకి వచ్చింది. ఆ పాపం వెనుక ఉన్న ప్రధాన రాక్షసుడు ఎవరో కాదు.. మాజీ సీఎం జగన్ రెడ్డి బంధువు, టీటీడీ మాజీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి!

‘పవిత్ర’ పదవిలో ‘పాపాత్ముడి’ పాలన :

2019లో టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి పేరును ప్రకటించినప్పుడే హిందూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఆయన మతపరమైన నేపథ్యం మీద పెద్ద చర్చే జరిగింది. వెంటనే వికీపీడియాలో సవరణలు చేసి ‘‘హిందువు’’ అని చూపించి, అయ్యప్ప మాల వేసుకున్నట్లు ఫోటోలు ప్రసారం చేశారు. కానీ అది భక్తుల ఆవేశాన్ని చల్లార్చడానికి చేసిన డ్రామా మాత్రమే. ఎందుకంటే తరువాతి ఐదేళ్లలో ఆయన చేసిన పనులు, నిర్ణయాలు ఏ ఒక్కటీ ‘‘ధర్మపరమైనవి’’ కాదు.. పూర్తిగా వ్యాపార ధోరణిలో, కమీషన్ రాజకీయం చుట్టూ తిరిగాయి.

రూ.25 కమీషన్ కోసం 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి! :

2022 మే 25న, టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డిని హైదరాబాదులోని ఆయన క్యాంప్ కార్యాలయంలో పోమిల్ జైన్, కైలాష్ చంద్ మాంగ్లా, పీ.పి. శ్రీనివాసన్ అనే నెయ్యి సరఫరాదారులు కలిశారు. ఆ సమావేశంలో చైర్మన్ పీఏ కడురు చినప్పన్న ప్రతి కిలో నెయ్యికి రూ.25 కమీషన్ డిమాండ్ చేశాడట. ఇది ఒట్టి మాట కాదు.. దర్యాప్తు సంస్థల వద్ద ఉన్న రికార్డులతో నిర్ధారితమైన అంశం. ఈ లంచం కోసం 20 లక్షలు, 30 లక్షలు అంటూ న్యూఢిల్లీలో హవాలా మార్గంలో నగదు స్వీకరించినట్లు సాక్ష్యాలు బయటపడ్డాయి. ఆ డబ్బు ఎవరికి వెళ్ళిందో, ఎవరికి భాగం ఇచ్చారో కూడా సిట్ విచారణలో బయటపడుతోంది.

కల్తీ నెయ్యి వెనుక దాగిన కుచక్రం :

భక్తులు స్వామివారికి సమర్పించే ప్రసాదం అంటే ‘‘నెయ్యి’’, ‘‘లడ్డూ’’ పవిత్రమైనవి. కానీ వాటిలో కల్తీ చేయడం అంటే భక్తి మీదే దాడి చేయడమే. 2022 మేలో భోలే బాబా ఆర్గానిక్ డైరీపై అజ్ఞాత ఫిర్యాదు వచ్చినప్పుడు టీటీడీ జీఎంకు విచారణ అప్పగించారు. ఆపై నమూనాలు సేకరించి సీఎఫ్‌టీఆర్ఐ ల్యాబ్‌కి పంపగా, ఆగస్టు 2022లో వచ్చిన నివేదికలో అన్ని శాంపిల్స్‌లో వెజిటబుల్ ఆయిల్ కల్తీ ఉన్నట్లు తేలింది. అంటే భక్తులు ‘‘నెయ్యి’’ అనుకుని తిన్నది అసలు ‘‘పామ్ ఆయిల్, కెమికల్ మిశ్రమం’’!

See also  రహ దారుణా' లు... ప్రాణహరణాలు!

అయితే ఆ నివేదిక వచ్చిన తరువాత కూడా వైవీ సుబ్బారెడ్డి ఎటువంటి చర్య తీసుకోలేదు. అంతేకాదు.. అదే కంపెనీలకు 2024 వరకు సరఫరా కొనసాగించేందుకు అనుమతులు పొడిగించారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు.. అపారమైన అవినీతి ధైర్యం.

భక్తుల భక్తిని అమ్మేసిన వారే నిజమైన రాక్షసులు :

తిరుమల కొండమీద ఉన్న భగవానుడి సన్నిధిలో ఇలా దొంగచాటుగా మలిన కర్మలు జరగడం భక్తుల హృదయాలను ముక్కలు చేసింది. కోట్లాది మంది నమ్మిన ఆ దేవస్థానం ‘‘కమీషన్ స్థానం’’గా మారిపోయింది. ధర్మం పేరిట అధికారాన్ని దుర్వినియోగం చేసి, భక్తుల విశ్వాసాన్ని అమ్మేసిన ఈ రాక్షసుల పాపం తుడుచుకునే మార్గమే లేదు.

‘‘ఓం నమో వెంకటేశాయ’’ అని నోట పలుకుతూ, మనసులో లంచం లెక్కలు వేసే పాలకుల వల్లే తిరుమల పవిత్రత కలుషితమైంది. ఈ పాపాల ఫలితమే.. 2024లో వైసీపీకి భక్తుల తీర్పు రూపంలో ఎదురైంది.

సీఎఫ్‌టీఆర్ఐ నివేదిక దాచిపెట్టిన ‘ధర్మానులు’ :

ఈ అవినీతి తాలూకు నివేదికలు సిట్‌కి అందించినప్పుడు వైవీ సుబ్బారెడ్డి జంట పానిక్‌కి గురైందట. సుప్రీంకోర్టు నియమించిన సిట్ బ్యాంక్ స్టేట్‌మెంట్లు ఇవ్వమంటే, వ్యక్తిగత గోప్యత పేరుతో కోర్టుకు వెళ్లారు. అంటే ఏదో దాచాల్సినదున్నది కదా! ప్రజా ధనం, దేవుని ధర్మం కలిసిన చోట పారదర్శకత ఉండాలి. కానీ ఈ ‘‘దంపతులు’’ పారదర్శకతను కాదు, ‘‘పరమార్థం’’ పేరుతో లంచాలను కప్పిపుచ్చారు.

2019–2024: తిరుమల చరిత్రలో నల్ల పుట

ఈ అయిదేళ్లలో మొత్తం 60,37,351 కిలోల కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా అయింది. దీని విలువ సుమారు రూ.240 కోట్లు. అంటే ప్రతి లడ్డూ, ప్రతి నైవేద్యం వెనుక ఒక పాపపు వాసన! స్వామివారి లడ్డూ ప్రపంచ ప్రసిద్ధి.. కానీ జగన్ బాబాయి పాలనలో అది అవినీతి ప్రసాదంగా మారింది.

కలియుగ వైకుంఠానికి మళ్లీ ధర్మసంక్షేమం అవసరం :

తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం ఒక మత సంస్థ కాదు.. అది తెలుగు జాతి గౌరవం, భారతీయ ఆధ్యాత్మికతకు ప్రతీక. ఆ ఆలయాన్ని కలుషితం చేసిన వారిని క్షమించకూడదు. వారిని భక్తులు క్షమించరు కూడా. దేవుడు కనుక నిశ్శబ్దంగా చూస్తున్నట్టు అనిపించినా, ధర్మం ఎప్పుడూ మౌనంగా ఉండదు. ‘‘దేవుడి ఇష్టం’’ అనే మాటకు అర్థం.. ఈ పాపాత్ములు బహిర్గతం కావడమే!

ధర్మపరిపాలనకు సమయం వచ్చింది :

వైవీ సుబ్బారెడ్డి వంటి రాక్షసులు తిరుమల పరిపాలనలోకి రావడానికి వీలు కల్పించినది జగన్ ప్రభుత్వమే. ‘‘ధర్మం’’ అనే మాటను ‘‘కమీషన్’’గా మార్చిన వారే వైసీపీ నాయకత్వం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. భక్తుల విశ్వాసం తిరిగి నిలబడుతోంది. కొత్త పాలకులు ఈ పాపాలపై చర్యలు తీసుకోవాలని, భక్తుల విశ్వాసం తిరిగి పొందేలా తిరుమల పరిపాలనను పారదర్శకంగా చేయాలని సమాజం కోరుకుంటోంది.

See also  ప్రతి నీటి బొట్టు .. బంగారమే పొదుపుగా వాడుకుందాం

భక్తి బలమే అంతిమ శక్తి :

వైవీ సుబ్బారెడ్డి, జగన్ బంధుత్వం, ధర్మానుల దుర్నీతులు ఎంత పెద్దవైనా.. భక్తుల నమ్మకం వాటిని మింగేస్తుంది. ‘‘సర్వం శ్రీ వెంకటేశ్వరమిథం’’ అని నమ్మిన ఈ జాతి, రాక్షసుల పాలనను తోసి పారేసి, తిరిగి వైకుంఠాన్ని పవిత్రం చేస్తుంది. ధర్మం ఆలస్యంగా రాగలదు కానీ నిర్ధారణతో వస్తుంది.

భక్తుల విశ్వాసం మీద దాడి చేసిన రాక్షసుల పాపాలు ఇప్పుడే బయటపడుతున్నాయి.

ఇంకా బయటపడాల్సినవి చాలా ఉన్నాయి.

కలియుగ వైకుంఠం మళ్లీ పవిత్రం కావాలంటే — ధర్మం మాట్లాడాలి, భక్తి గళం వినిపించాలి.

 

జమ్ము సాయి కల్యాణ్,

పొలిటికల్ అనలిస్టు,

మేనేజింగ్ డైరెక్టర్,

జనస్వరం మీడియా.

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి