
విశాఖపట్నం, (జనస్వరం) : విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ రద్దు చేయాలని కోరుతూ ఉక్కు పరిరక్షణ సమితి చేస్తున్న పోరాటానికి మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈనెల 31వ తేదీన విశాఖకు రానున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ గారు తెలిపారు. తెలుగుజాతి ఆత్మగౌరవం నిలబెట్టుకునేందుకు జరుగుతున్న ఈ పోరాటానికి పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరు ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు వస్తేనే న్యాయం జరుగుతాదనే ఉక్కు పరిరక్షణ సమితి నాయకులు, నిర్వాసితులు ముక్తకంఠంతో ఆయనను ఆహ్వానించడం జరిగిందన్నారు. బొలిశెట్టి సత్యనారాయణ, పీఏసీసభ్యులు కోన తాతారావు మాట్లాడుతూ 31వ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు గాజువాక కూర్మన్నపాలెం జంక్షన్ లో సందర్శించి బహిరంగ సభలో పవన్ సూచనలతో దిశానిర్దేశం చేస్తారని తెలియజేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు మొదటిలోనే పవన్ కళ్యాణ్ గారు స్పందించి నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఢిల్లీ నాయకుల్ని అభ్యంతరం చేయడం జరిగిందన్నారు. ప్రవేటీకరణకు వ్యతిరేకంగా జనసేనపార్టీ నిర్వాసితులకు, కార్మికులకు అండగా ఉంటుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు హాజరవుతున్న ఈ సభ సామాజిక అంశమని, దీనిని రాజకీయం చేయకుండా తెలుగుజాతి ఆత్మగౌరవానికి తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ ధ్యేయంగా చూడాలన్నారు. ఈ సభ ప్రశాంతంగా నిర్వహించేందుకు 500మంది వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం అందించామన్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు రాకపై ఏర్పాట్లుకు సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, వన్నెం రెడ్డి సతీష్ తదితరులు పాల్గొన్నారు.








