ప్రజాగ్రహం అంటే ఏమిటో వైసీపీకి చూపిస్తాం – శ్రీ పవన్ కళ్యాణ్ గారు…

                         దాష్టీకాలు పెరిగితే తిరుగుబాటు వస్తుంది….  వైసీపీ నాయకుల దాష్టీకాలు పెచ్చు మీరాయి… ప్రజల ధర్మాగ్రహానికి గురికాక తప్పదని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు. నియంతృత్వ ధోరణితో రెచ్చిపోతున్న మీకు ప్రజాస్వామ్యం, ప్రజాగ్రహం అంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తామని అన్నారు. అధికార పార్టీ నాయకుల వేధింపులు తాళలేక ఇటీవల బలవన్మరణం చెందిన గిద్దలూరు నియోజకవర్గ సింగరపల్లికి చెందిన శ్రీ వెంగయ్య నాయుడు కుటుంబాన్ని శనివారం ఉదయం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరామర్శించారు. శ్రీ వెంగయ్య చిత్రపటం ముందు జ్యోతి వెలిగించి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ ఏ మనిషైనా నిండు నూరేళ్లు చల్లగా బతకాలని కోరుకుంటాం. అలాంటింది శ్రీ వెంగయ్య పట్టుమని మూడు పదులు నిండకుండానే ప్రాణాలు కోల్పోయాడు. ఏం తప్పు చేశాడు? ఏ నేరం చేశాడు? పదిమంది తిరిగే రహదారి బాగోలేదని అడిగినందుకే చంపేశారు. ఇష్టమొచ్చినట్లు తిట్టే వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు ఒక్కసారి శ్రీ వెంగయ్య కుటుంబాన్ని చూడండి. రోడ్డు బాగోలేదని ప్రశ్నించిన ఈ పసిబిడ్డల తండ్రిని చంపేశారు. ప్రజాప్రతినిధుల కుటుంబాలు, వారి బిడ్డలు బాగుండాలి కానీ. ప్రశ్నించే వారి కుటుంబాలను మాత్రం ఛిధ్రం చేసేస్తారు. 

ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారు ?

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు… మీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు చేసిన పని ఒక్కసారి చూడండి. ఇద్దరు పసిబిడ్డలకు తండ్రి లేకుండా చేశారు. మీ ప్రభుత్వానికి 151 మంది ఎమ్మెల్యేలను ఇస్తే… మీరు పసిబిడ్డలకు తండ్రి లేకుండా చేశారు. మీ ఎమ్మెల్యే చేసిన పనికి మీరు బాధ్యత వహిస్తారా? ఆయన్ను సస్పెండ్ చేయగలరా? కనీసం ఆయన్ను మందలించగలరా? ఇలాంటి దాష్టీకాలను మీ పేపర్, ఛానల్స్ లో ప్రసారం చేయరు. మీకు వ్యతిరేకంగా రాస్తున్న జర్నలిస్టులను కూడా బతకనీయడం లేదు. మీరు అనుకున్నవారే జర్నలిస్టులా? మిగతా వారు ఏం మాట్లాడకూడదా? మీరు చేసిన దాష్టీకాలు మీరు మర్చిపోవచ్చు. మేము మాత్రం గుర్తుపెట్టుకుంటాం. మా దగ్గర వేల కోట్లు, ప్రైవేటు సైన్యం, కిరాయి మూకలు లేకపోవచ్చు.. కానీ న్యాయం జరిగే వరకు పోరాటం మాత్రం ఆగదు. 

రాంబాబూ…. నీ పతనం మొదలయ్యింది 

జనసైనికుడు శ్రీ వెంగయ్య కుటుంబం సాక్షిగా చెబుతున్నాను… అన్నా రాంబాబూ..! నీ పతనం ప్రారంభమయ్యింది. నిన్ను అథ:పాతాళానికి తొక్కకపోతే అడగండి. శ్రీ వెంగయ్య కుటుంబంతో కలసి ఎస్పీ గారిని కలుస్తాం. న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరతాం. ఈ రోజు వైసీపీ నాయకులు అధికారం అడ్డుపెట్టుకొని మీరు తప్పించుకోవచ్చు. భవిష్యత్తులో మా ప్రభుత్వం వచ్చాక మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టేది లేదు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటం కోసం ఒక గొంతు ఎత్తితే దానిని తొక్కేశారు. అది కోటి గొంతుకులై తిరిగొస్తుంది గుర్తుపెట్టుకోండి.  పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము కానీ… ఆ కుటుంబానికి కడ వరకు అండగా ఉంటానని హామీ’’ ఇచ్చారు.  

See also  రైతులకు లాభసాటి ధర సాధనే జనసేన లక్ష్యం - శ్రీ పవన్ కళ్యాణ్ గారు...

శ్రీ వెంగయ్య బిడ్డలను చదివించే బాధ్యత తీసుకుంటాం: శ్రీ నాదెండ్ల మనోహర్ గారు

ఆశయ సాధన కోసం, సమాజంలో మార్పు కోసం, జవాబుదారీతనం కోసం నిలబడి ప్రాణాలొడ్డిన జనసైనికుడు శ్రీ బండ్ల వెంగయ్య నాయుడు కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుంది అని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. ఆయన మాట్లాడుతూ “గ్రామ అభివృద్ధి కోసం చేసిన ప్రయత్నం విషాదాంతం కావడం బాధాకరం. ప్రతి ఒక్కరూ తలదించుకోవాల్సిన పరిస్థితి ఇది. ఈ మొండి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడేలా, ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో హక్కు అనే విషయం బోధపడేలా మనం కలసికట్టుగా పని చేద్దాం. పార్టీకి అండగా ఉందాం. మనకు మంచి నాయకత్వం ఉంది. శ్రీ వెంగయ్య కుటుంబాన్ని ఆదుకోవడానికి మీరంతా పెద్ద మనసుతో ముందుకు రావాలి. పార్టీ తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారు రూ.8.5 లక్షలను ప్రకటించారు. పిల్లల చదువు బాధ్యతను పూర్తిగా తీసుకుంటానని వెల్లడించారు. ఇంత గొప్ప నాయకుడున్న మనము పార్టీ అభివృద్ధికి కంకణం కట్టుకోవాలి. పట్టుదలతో పని చేయాలి” అన్నారు. సమావేశం ప్రారంభం కాగానే శ్రీ వెంగయ్య నాయుడు ఆత్మకు శాంతి చేకూరాలంటూ కొద్దిసేపు మౌనం పాటించారు. శ్రీ వెంగయ్య నాయుడు భార్య శ్రీమతి కేశవ నారాయణమ్మకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక సహాయం అందించారు. ఆ కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి