
స్కూల్లో అడ్మిషన్ల కోసం సరికొత్త ప్రచారం :
స్వర్ణ గ్రామ సిబ్బంది, స్కూల్ కమిటీ సహకారం :
కక్కలపల్లిలో ఇంటింటికీ యాత్ర విజయవంతం :
అనంతపురము, మే 21, జనస్వరం : ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల పెంపుకోసం ప్రధానోపాధ్యాయుడు వినూత్న పంథాను అనుసరిస్తున్నారు. ప్రచార రథంతో పాటు ఫ్లెక్సీలు, పోస్టర్లు, కరపత్రాలు సిద్ధం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు “బడి పిలుస్తోంది” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. సాక్షాత్తూ మండల విద్యాశాఖాధికారి ద్వారా ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభింపజేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు, స్వర్ణ గ్రామ సిబ్బందిని కూడా సంసిద్ధులను చేశారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ, కక్కలపల్లి ప్రాథమిక పాఠశాల హెడ్మాష్టర్, ప్రముఖ ఆర్థికవేత్త గొర్తి వెంకటస్వామి ముందుకు సాగుతున్నారు. అనంతపురం రూరల్ ఎంఈఓ ఈ. వెంకటస్వామి ప్రత్యేక శ్రద్ధతో గురువారం క్షేత్రస్థాయి పర్యటన సాగించారు. ఉపాధ్యాయులతో పాటు, స్వర్ణ గ్రామ ఉద్యోగులు, సిబ్బంది, పాఠశాల యాజమాన్య కమిటీ, తల్లిదండ్రులు, గ్రామ పెద్దల సహకారాన్ని చూసి ఆయన అభినందించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అడ్మిషన్ల పెంపు కోసం, హెడ్మాస్టర్ గొర్తి వెంకటస్వామి సాగిస్తున్న నిరంతర కృషిని ఎంఈఓ ప్రశంసించారు. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా 1996 డీఎస్సీ ద్వారా ఎంపికైన గొర్తి 50 సార్లు పాఠశాలలో జాతీయ పతాకావిష్కరణ చేశారని గుర్తు చేశారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి నిరంతరకృషి చేస్తూ, పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేకశ్రద్ధ చూపుతున్నారన్నారు. సొంత నిధులతో పాఠశాలకు మంచినీటి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలను ప్రజలకు వివరించారు. అర్హత, అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో ఉచిత విద్యాబోధన, ప్రతి విద్యార్థికి “సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర” కిట్ (యూనిఫామ్ మూడు జతలు, పాఠ్య పుస్తకాలు,నోట్ బుక్స్, షూ, స్కూల్ బ్యాగ్) ఉచితంగా ఇస్తారు. ప్రతి విద్యార్థికి “తల్లికి వందనం” పథకం వర్తిస్తుంది. ప్రతి విద్యార్థికీ “డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం” ద్వారా ప్రతిరోజూ నాణ్యమైన ఉచిత భోజనం ( వారానికి ఐదు గుడ్లు, వేరుశెనగ చిక్కీలు, రాగి జావ) అందిస్తారు. “మనబడి – మన భవిష్యత్తు” పథకం ద్వారా పాఠశాలల్లో ఆధునిక వసతులను కల్పిస్తారు. ఒకటి నుండి 5వ తరగతి విద్యార్థుల సామర్ధ్యాలను పెంపొందించుటకు ప్రత్యేకంగా రూపొందించిన జి – ఎఫ్.ఎల్.ఎన్., మూడు నుండి 5వ తరగతి విద్యార్థుల కోసం టీఏ.ఆర్ఎల్ ప్రోగ్రాం నిర్వహిస్తారు. ప్రాథమిక తరగతుల విద్యార్థులకు “జాడూ పితారా – ఎఫ్ఎల్ఎన్” కిట్స్ ద్వారా బోధిస్తారు. స్మార్ట్ టీవీలు, ఐ.ఎఫ్.పి ల ద్వారా పూర్తిస్థాయి డిజిటల్ విద్యాబోధన ఉంటుంది. పిఎఎల్ ల్యాబ్ నిర్వహణ ద్వారా ఆరు నుండి 9వ తరగతి విద్యార్థులకు గణితం, ఆంగ్లం, తెలుగు సబ్జెక్టులలో సామర్ధ్యాల ఆధారంగా “టాబ్” ల ద్వారా స్వీయ అభ్యసన ఉంటుంది. క్లిక్కర్స్ ద్వారా విద్యార్థులు వేగవంతమైన, స్వీయ మూల్యాంకనం నిర్వహిస్తారు. విద్యార్థుల ప్రగతిపై ప్రతినెలా తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశాలలో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను అందజేస్తారు. దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు రవాణా భత్యం అందిస్తారు. ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’ ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించే కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం (సిడబ్ల్యూఎస్ఎన్) “భవిత కేంద్రాలు”, సుశిక్షితులైన ఉపాధ్యాయుల పర్యవేక్షణ శోధన కొనసాగుతుంది. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు రవాణా భత్యము, “స్టైఫండ్ ఫర్ గర్ల్స్”, ఎస్కార్ట్ అలవెన్స్, బేస్ టీన్డ్ ఎడ్యుకేషన్ అలవెన్స్ వంటివి అందిస్తారు. నమ్మకమైన చదువుకు నాణ్యమైన భరోసా ప్రభుత్వ బడి అని ప్రజలకు వివరించారు.
పిల్లల్లో మానసిక దృఢత్వం పెంపొందించడం కోసం విశాలమైన ఆట స్థలాలు అందుబాటులో ఉంటాయి. వివిధ రకాలైన క్రీడలలో తర్పీదు, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొనే సువర్ణ అవకాశం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉంటుంది. నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) కొరకు 8వ తరగతి విద్యార్థులకు, నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ (ఎన్.టి.ఎస్.ఈ) కోసం పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు విజ్ఞాన, వినోద, విహార యాత్రలకు ఆర్థిక సహాయం అందిస్తారు. విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలు పెంపొందించడానికి వృత్తి విద్య, స్టెమ్ ల్యాబ్, అటల్ టింకరింగ్ ల్యాబ్ లను నిర్వహిస్తారు. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గించడానికి యోగా, కెరీర్, హెల్త్ కౌన్సిలింగ్, బాలికలకు ప్రత్యేకంగా ఆత్మరక్షణ విద్యలో శిక్షణ ఇస్తారు. బాలికల కొరకు ప్రత్యేకంగా అధునాతన వసతులతో కేజీబిఐ లను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్య కొనసాగడానికి వీలుగా హై స్కూల్ ప్లస్, ఏపీ మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేశారు. పదో తరగతి విద్యార్థులకు ఉత్తమ ఫలితాల కోసం ప్రత్యేక తరగతులు, కార్యాచరణ ప్రణాళిక అమలు, ప్రతిభ కనబరిచిన షైనింగ్ స్టార్ విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేస్తున్నారు. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం శ్రీ) పథకం ద్వారా పలు పాఠశాలలను ఎంపిక చేసి అధునాతన వస్తువులతో అభివృద్ధి చేస్తున్నారు. ఇన్స్పైర్ అందిస్తూ, శాస్త్ర విద్యపై ఆసక్తి పెంపొందించి, ఉన్నత విద్య ఉజ్వల భవిష్యత్ అవకాశాలకు మార్గాలను చూపుతున్నారు. విద్యార్థుల హాజరు, వారి విద్యా ప్రగతిని నేరుగా తల్లిదండ్రుల మొబైల్ కు లీప్ యాప్ ద్వారా పర్యవేక్షించే సదుపాయం కల్పించారు. మద్రాస్ ఐఐటి వారి సహకారంతో విద్యా శక్తి ద్వారా 6 – 9 తరగతి విద్యార్థులకు నిపుణులతో ఉత్తమ బోధన, ప్రతి పాఠశాలకు ముస్తాబు కార్యక్రమం అమలు చేస్తున్నారు. ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు అన్ని పరీక్షల కోసం ఒకే అసెస్మెంట్ ఉంటుంది. ప్రతి పరీక్షలో వారి ప్రగతిని నమోదు చేసి, లోపాలను గుర్తించి, మెరుగుపరుచుకునే సదుపాయం కల్పిస్తున్నారు.

ప్రముఖ విద్యావేత్త, రాయలసీమ ప్రజాసమాఖ్య అధ్యక్షులు, కక్కలపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్తి వెంకటస్వామి పలు అరుదైన ఘనతలను సాధించారని స్థానికులు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో 1998 ఆగష్టు నుంచి 2025 ఆగష్టు 15 వరకు 50 సార్లు జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. 1996 డిఎస్సిలో సెకండరీ గ్రేడ్ టీచర్ గా ఎంపికైన ఆయనకు రెండేళ్లకే అరుదైన అవకాశం లభించింది. యాడికి మండలం రామరాజు పల్లి ప్రాథమిక పాఠశాలలో తొలిసారిగా జాతీయ పతాకావిష్కరణ చేశారు. అప్పటినుంచి 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల వరకూ నిరంతరాయంగా గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే ఘనత ఆయనకు దక్కింది.
వృత్తినే దైవంగా భావిస్తూ, దశాబ్దాలగా నిబద్ధతతో సేవలందిస్తున్నారు ప్రధానోపాధ్యాయులు గొర్తి వెంకటస్వామి. ఎక్కడ పనిచేసినా మానవత్వంతో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు, పాఠశాల యాజమాన్య కమిటీతో తగిన సమన్వయం కొనసాగిస్తున్నారు. విధి నిర్వహణకు సామాజిక బాధ్యతను జోడించి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశుభ్రం చేయడంలో, అక్కడ పచ్చదనాన్ని పెంచడంలో తనకు తానే సాటి అని పలుసార్లు నిరూపించుకున్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనతో పాటు, పాఠశాలలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పుతున్నారు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో పాటు పిల్లలకు స్వచ్ఛమైన గాలి కూడా అందేలా కృషి చేస్తున్నారు. వ్యక్తిత్వ వికాస పాఠాలను తనదైన శైలిలో చెబుతూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. పరీక్షలంటే భయం లేకుండా సన్నద్ధం చేస్తూ, పిల్లల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సమగ్ర వికాసానికి నిరంతరం కృషి సాగిస్తున్నారు. అవసరమైతే సొంత నిధులను సైతం వెచ్చిస్తున్నారు ప్రధానోపాధ్యాయులు గొర్తి వెంకటస్వామి. మూడు దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసిన వెంకట్, 2025 జూన్ బదిలీల్లో అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు చేపట్టారు. తొలి రోజు నుంచే తనదైన శైలిలో, వినూత్నమైన రీతిలో పనిచేయడం ప్రారంభించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల సహకారంతో ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషి సాగిస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు కోసం హెడ్మాష్టర్ గొర్తి వెంకట్ సొంత నిధులతో అనంతపురం నగరం నుంచి ప్రతిరోజూ నీటి ట్యాంకర్ ను తెప్పిస్తున్నారు. మధ్యాహ్న భోజనం వండటానికి కూడా మంచినీరు వాడాలని సిబ్బందికి సూచిస్తున్నారు. హెడ్మాష్టర్ వెంకట్ సేవానిరతిని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామస్తులు ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు.

నిబద్దతకు మారుపేరు హెడ్మాష్టర్ గొర్తి వెంకటస్వామి
అనంతపురం రూరల్ మండలం లోని కక్కలపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా గొర్తి వెంకటస్వామి 2025 జూన్ 5 న బాధ్యతలు చేపట్టారు. అదేరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రపరచి, మొక్కలు కూడా నాటారు. రూరల్ మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో 2025 జూన్ 1 న, ఆదివారమే జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. విడపనకల్ మండలం పాల్తూరు మెయిన్ స్కూల్ హెడ్మాష్టర్ గా పనిచేస్తున్న ఆయనను సాధారణ బదిలీల్లో భాగంగా ప్రభుత్వం ఇక్కడ నియమించింది. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ., (ఆర్థిక శాస్త్రం) బి.ఎడ్., (సోషల్ స్టడీస్), ఎం.ఫిల్., (మండల పరిషత్ నిధుల వినియోగం : ఒక అధ్యయనం) పూర్తిచేశారు. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్.జి.టి.) గా 1996 డి.ఎస్సీలో ఎంపికై ప్రాథమిక విద్యారంగంలో విశేష సేవలందిస్తున్నారు.
ప్రముఖ విద్యావేత్త, రాయలసీమ ప్రజా సమాఖ్య అధ్యక్షులు గొర్తి వెంకటస్వామి సుదీర్ఘ సేవలకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని 2024లో అందుకున్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ అవార్డును గతంలో అందుకున్నారు. 2025 జనవరిలో ‘ప్రజా కళావేదిక’ ఆధ్వర్యంలో తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయనకు పురస్కార ప్రదానం చేశారు. మూడు దశాబ్ధాలుగా విద్యారంగంలో విశేష సేవలందిస్తున్న గొర్తి వెంకటస్వామికి ఈ సందర్భంగా దుశ్శాలువా కప్పి, ప్రశంసాపత్రంతో పాటు జ్ఞాపిక అందజేసి ఘనంగా సత్కరించారు. విడపనకల్ మండలం పాల్తూరు మెయిన్ స్కూల్ హెడ్మాష్టర్ గా వెంకటస్వామి సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా, శ్రీవెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ గౌరవ సలహాదారుగా, నల్లాని రాజేశ్వరి ఫౌండేషన్ ముఖ్య సలహాదారుగా ఆయన పనిచేస్తున్నారు. గతంలో యాడికి మండల ఉత్తమ టీచర్ గా రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ నుంచి అవార్డు పొందారు. సర్వేపల్లి రాధాకృష్ణ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని 2022 సెప్టెంబర్ లో జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ చేతులమీదుగా అందుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతోత్సవ కార్యక్రమంలో భాగంగా శ్రీవెంకట పద్మావతి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయనకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం లభించింది. తిరుపతి మాజీ ఎమ్మెల్యే ఎం. సుగుణమ్మ, తుడా మాజీ చైర్మన్ ఎం. నరసింహ యాదవ్ తదితరులు 2023 మే 9న తిరుపతి యూత్ హాస్టల్లో ఘనంగా సత్కరించారు. విద్యారంగంతో పాటు సాహిత్య, సాంస్కృతిక, కళా, సామాజిక సేవారంగాల్లో వెంకటస్వామి తన వంతు పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. పిల్లల సమగ్రాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు, పరిసరాల పరిశుభ్రత, ప్రజారోగ్య సంరక్షణ కోసం విశేషకృషి సాగిస్తున్నారని గుర్తుచేశారు. ప్రతిభ, నిబద్ధత, సేవాభావంతో ఎన్టీఆర్ జాతీయ పురస్కార గ్రహీత, డా. సర్వేపల్లి జాతీయ అవార్డు అవార్డు అందుకున్న గొర్తి వెంకటస్వామి కక్కలపల్లి ప్రాథమిక పాఠశాల హెడ్మాష్టర్ గా బాధ్యతలు స్వీకరించి అంకిత భావంతో విధులు నిర్వహించడం పట్ల పలువురు కవులు, టీచర్లు, తల్లిదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తంచేశారు.
విద్యాసేవకు పునరంకితం : గొర్తి వెంకట్ భావోద్వేగం
రేపటి పౌరులను తీర్చిదిద్దే బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేయడం చాలా గర్వంగా ఉందని హెడ్మాష్టర్ గొర్తి వెంకటస్వామి అన్నారు. వృత్తిలో మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న శుభవేళ విద్యాసేవకు పునరంకితమవుతానని ప్రకటించారు. విద్యార్థుల్లో దేశభక్తి భావాలను పెంపొందించేందుకు తనవంతు కృషి కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా 50వ సారి జాతీయ జెండాను ఎగరవేసే అరుదైన అవకాశం తనకు రావడం అదృష్టమన్నారు. 1998లో తొలిసారిగా జాతీయ జెండా ఎగరవేసిన మధుర క్షణాలను గుర్తుచేసుకొని వెంకట్ భావోద్వేగానికి లోనయ్యారు. మూడు రంగుల జెండాను గుండెలకు హత్తుకునే 50 సందర్భాలు తన జీవితంలో రావడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. మాతృమూర్తిని గౌరవించాలని, మాతృభాషను సంరక్షించాలని, మాతృదేశాన్ని ప్రేమించాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ సమైక్యతకు మువ్వన్నెల జెండా నిరంతరం స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమగ్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా పాటుపడతానని స్పష్టం చేశారు. అన్నివిధాలా తనను ఎంతగానో ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు.









