
మానవత్వానికి నిదర్శనం రెడ్ క్రాస్.
పల్నాడు జిల్లాలో ఘనంగా ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం.
పల్నాడు,మే 08( జనస్వరం)
ప్రపంచవ్యాప్తంగా ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తూ,మానవ సేవయే మాధవ సేవగా పనిచేస్తున్న రెడ్ క్రాస్ సంస్థ వ్యవస్థాపకుడు సర్ హెన్రీ డ్యూనెంట్ జయంతిని పురస్కరించుకుని పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
ముందుగా జిల్లా రెడ్ క్రాస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేనేజింగ్ కమిటీ సభ్యులు, లైఫ్ మెంబర్స్, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెన్రీ డ్యూనెంట్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా చైర్మన్ ఎం.ఆర్ శేషగిరిరావు మాట్లాడుతూ యుద్ధభూమిలో క్షతగాత్రుల ఆర్తనాదాలు చూసి చలించిపోయి జాతి,కుల,మత విభేదాలు లేకుండా సేవ చేయాలనే సంకల్పంతో డ్యూనెంట్ ఈ సంస్థను స్థాపించారని గుర్తుచేశారు. ఆయన చూపిన బాటలో నేడు లక్షలాది మంది వాలంటీర్లు ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నారని కొనియాడారు. అదేవిధంగా పల్నాడు జిల్లాలో ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నామని దానిలో భాగంగానే మీ ఇంటికి మీ డాక్టర్ అనే ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని,కళాశాల లోని విద్యార్థిని విద్యార్థులకు సిపిఆర్ మరియు ఆరోగ్యం పై తీసుకోవాల్సిన విషయాల పైన అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నామని, ఇండస్ట్రీలలో ప్రథమ చికిత్స శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని, బ్లడ్ బ్యాంక్ ద్వారా ఆపదలో ఉన్న ఎందరినో ఆదుకుంటున్నామని,తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా రక్తం అందిస్తున్నామని రాబోవు రోజుల్లో ఈ సేవలను మరింత విస్తరిస్తామని తెలియజేశారు.అనంతరం సభ్యులందరూ కలిసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న బాలింతలకు మరియు రోగులకు పండ్లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో డి.ఎం. అండ్ హెచ్.ఓ డాక్టర్ రవి , పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ ఎం రామశేషగిరి రావు,వైస్ చైర్మన్ కే.ఎం. ఎన్.వి.శ్రీనివాస గుప్తా, కోశాధికారి డాక్టర్ నంద్యాల రాంప్రసాద్ రెడ్డి,కమిటీ సభ్యులు బత్తుల మురళి, డాక్టర్ రాంప్రసాద్, డాక్టర్ సృజన, భుజంగరావు, రెడ్ క్రాస్ లైన్ మెంబర్స్,రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








