
– అరవింద్‌నగర్ ఇన్‌చార్జ్ మరక నాగేంద్ర యాదవ్
– హిందూ సంప్రదాయాల పరిరక్షణకు పిలుపు
అనంతపురం, ఏప్రిల్ 24, (జనస్వరం) : నగరంలోని శ్రీకంఠం సర్కిల్ సమీపంలోని లెన్స్‌కార్ట్ షోరూం వద్ద హిందూ సోదరులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అరవింద్‌నగర్ ఇన్‌చార్జ్ మరక నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లెన్స్‌కార్ట్ బహిష్కరణ నినాదాలు మార్మోగాయి. ఈ సందర్భంగా నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ, సనాతన ధర్మం సర్వమానవాళి శ్రేయస్సు కోరుకునే ప్రాచీన సంప్రదాయం అని పేర్కొన్నారు. భారతదేశంలో వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆచారాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. హిందూ సంప్రదాయాలను పాటించవద్దని సంస్థలు ఆదేశించడం సరైంది కాదని, అలాంటి విధానాలను తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు. లెన్స్‌కార్ట్ సంస్థలో హిందూ సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిరసన చేపట్టినట్లు తెలిపారు. మతపరమైన వివక్షకు తావు లేకుండా అన్ని మతాల వారికి సమాన అవకాశాలు కల్పించాలన్నారు. ఇతర నాయకులు మాట్లాడుతూ, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమని, ఏకపక్ష విధానాలు తగవని అన్నారు. నాని మాట్లాడుతూ లెన్స్‌కార్ట్ బహిష్కరణ ఉద్యమాన్ని జిల్లావ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత్ మాతాకీ జై, వందే మాతరం, జై శ్రీరామ్ నినాదాలు చేశారు. హిందూ సంప్రదాయానికి చిహ్నంగా సింధూరం తిలకాన్ని ఉద్యోగులు, కస్టమర్లకు స్వచ్ఛందంగా అందజేశారు. ఈ నిరసనలో హనుమంత్, ఓబుల్ రెడ్డి, తిరుమల నాయుడు, వరుణ్, ప్రవీణ్, మధు, రాజ్‌కుమార్, పవన్ తదితరులు పాల్గొన్నారు.








