
నెల్లూరు, మార్చి 30 (జనస్వరం) : కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4 కార్యక్రమంలో భాగంగా సీతారామపురం మండలంలో సొసైటీ డైరెక్టర్ పెనుబడి రఘురాములు చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి ప్రభుత్వం తరఫున సోమవారం వింజమూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఉదయగిరి నియోజకవర్గ ప్రత్యేక అధికారి, డీఆర్‌డీఏ పీడీ వి. నాగరాజ కుమారి, ఉదయగిరి నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ యంగ్ ప్రొఫెషనల్ చోడిపల్లి జాన్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. గత కొద్ది సంవత్సరాలుగా సీతారామపురం మండలంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు తదితర వస్తువులను పంపిణీ చేస్తూ అనేక సేవా కార్యక్రమాలను పెనుబడి రఘురాములు నిర్వహిస్తున్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టి ఊరూరా బండి పై ఐస్‌లు అమ్ముకుంటూ తాను సంపాదించిన దానిలో కొంత భాగాన్ని వెచ్చించి సామాజిక సేవలు నిర్వహిస్తున్న ఆయనను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అభినందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ చింతల శ్రీనివాసులు, మాజీ జడ్పిటిసి కలివెల జ్యోతి, సీతారామపురం సర్పంచ్ కొడవటికంటి భాగ్యమ్మ, నాయకులు వెంగలశెట్టి వెంకటేశ్వర్లు, కుర్ర రత్తయ్య యాదవ్, కాశీపోగు రాజేష్, పిడతల తిరుపతయ్య, కొడవటికంటి కిరణ్, కానాల సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.








