
నెల్లూరు, మార్చి 30 (జనస్వరం) : నెల్లూరు జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షించేందుకు విచ్చేసిన రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను 13వ డివిజన్ జనసేన ఇంచార్జ్ పేనేటి శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతులకు రావలసిన గిట్టుబాటు ధరలు అందేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గత 48 గంటల్లోనే ధాన్యం చెల్లింపులు వేగంగా జరుగుతున్నాయని, ప్రస్తుతం జిల్లాలో 175 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం సేకరణ కొనసాగుతోందని వెల్లడించారు. కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరిగినా వాటిని ఉపేక్షించబోమని, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించారు. రైతులు దళారులు మరియు మిల్లర్ల చేతుల్లో నష్టపోకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. అలాగే జియో ట్యాగింగ్ సమస్యలను కూడా సమీక్షించి, గోనె సంచులు మరియు రవాణా వ్యవహారాల్లో అవినీతి జరిగితే సంబంధిత మిల్లర్ల వివరాలను బహిర్గతం చేస్తామని స్పష్టం చేశారు. అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, రైతులకు న్యాయం జరిగే వరకు నిరంతరం చర్యలు కొనసాగుతాయని మంత్రి పేర్కొన్నారు.








