
– హెడ్మాష్టర్ గొర్తి వెంకట్ కు ప్రశంసలు
– తడి-పొడి చెత్త వేరుచేసి ఎరువుగా వినియోగం
అనంతపురము, మార్చి 28, జనస్వరం : రాష్ట్రంలో ప్రతి నెలా నిర్వహిస్తున్న “స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర” కార్యక్రమంలో భాగంగా ఈ నెల “జీరో వేస్ట్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్” అనే వినూత్న థీమ్‌తో కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రముఖ విద్యావేత్త, రాయలసీమ ప్రజాసమాఖ్య అధ్యక్షులు, కక్కలపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్తి వెంకటస్వామి తెలిపారు. శనివారం ఉదయం “స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర” కార్యక్రమంలో భాగంగా కక్కలపల్లి గ్రామంలో, పాఠశాల ప్రాంగణంలో అమలు చేస్తున్న వ్యర్థ నిర్వహణ విధానాలను స్థానికులకు, విద్యార్థులకు ఆయన వివరించారు. చాలా హాస్టళ్లలో తడి చెత్త, పొడి చెత్తలను వేరు చేసే “సోర్స్ సెగ్రిగేషన్” పద్ధతిని సమర్థవంతంగా అమలు చేస్తున్నారని వెంకట్ చెప్పారు. తడి చెత్తను శాస్త్రీయ పద్ధతిలో డీ కంపోజ్ చేసి ఎరువుగా మార్చి, అదే హాస్టల్ పరిధిలో ఆకుకూరలు, క్యారెట్, బీట్‌రూట్ వంటి కూరగాయలను పండించేందుకు వినియోగిస్తున్నారని చెప్పారు. దీని ద్వారా హాస్టల్‌కు అవసరమైన కూరగాయల కొనుగోలు వ్యయం గణనీయంగా తగ్గుతుందని వివరించారు. తడి చెత్త నుంచి ఉత్పత్తి అయ్యే ద్రవాన్ని హైడ్రోపోనిక్స్ విధానంలో వినియోగిస్తూ మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు. పొడి చెత్తను ప్రతి గురువారం “స్వచ్ఛరథం” ద్వారా సేకరించి రీసైక్లింగ్‌కు పంపిస్తున్నారన్నారు. ఈ విధంగా హాస్టల్‌లో ఉత్పత్తి అయ్యే చెత్తను సమర్థవంతంగా నిర్వహిస్తూ “చెత్త నుంచి సంపద” అనే భావనను కార్యరూపంలోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలను జిల్లాలోని అన్ని హాస్టళ్లు, ఆసుపత్రులు, ఇతర సంక్షేమ సంస్థల్లో అమలుచేయాలని తెలిపారు. ఒకటి, రెండు నెలల్లో అన్ని సంస్థల్లో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయడానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సురేష్ కృష్ణ, డిజిటల్ అసిస్టెంట్ గణేష్, వెల్ఫేర్ అసిస్టెంట్ తనూజ, కంప్యూటర్ ఆపరేటర్ మహేష్, స్థానికులు, వసతి గృహాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.








