మూడేళ్లుగా దెబ్బతిన్న రహదారి… సంకుపాలెం–కరకాం ప్రజల ఆవేదన

చీపురుపల్లి, ఫిబ్రవరి 24, (జనస్వరం) : చీపురుపల్లి మండలంలోని సంకుపాలెం గ్రామం నుంచి కరకాం గ్రామం మీదుగా పెరిపి రోడ్‌కు వెళ్లే సుమారు 3.5 కిలోమీటర్ల రహదారి గత మూడు సంవత్సరాలుగా దయనీయ స్థితిలో ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై రాళ్లు బయటకు తేలిపోవడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని పేర్కొన్నారు. ముఖ్యంగా పాఠశాలలు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ మార్గం ద్వారా నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తుండగా, వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు సైతం సకాలంలో చేరలేని పరిస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సంకుపాలెం, కరకాం, పరిసర గ్రామాల ప్రజలు కలిసి ఎమ్మెల్యే కిమిడి కళావేంకటరావును రహదారి పునర్నిర్మాణానికి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు స్పందించి త్వరితగతిన రహదారి పనులు ప్రారంభించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

See also  దేవస్థానం గ్యారేజీ పనితీరుపై అనుమానాలు