ప్రజల హక్కుల సంరక్షణకు పీహెచ్‌పీఎస్ నిరంతర పోరాటం

– ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి 9వ ఆవిర్భావ దినోత్సవంలో వక్తలు ఉద్ఘాటన

– నగరంలో ఘనంగా పీహెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

అనంతపురం, జన స్వరం : అనంతపురం నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్‌లో ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి (పీహెచ్‌పీఎస్) 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మన్నెపాకుల మాధవ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రజాసంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు, మేధావులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మన్నెపాకుల మాధవ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పీహెచ్‌పీఎస్ నిరంతరం పోరాటం కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. ముఖ్యంగా రైతులకు జరుగుతున్న అన్యాయాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ రైతు భరోసా పెంపు, ఇన్‌పుట్ సబ్సిడీలు, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం, ఉచిత బోర్లు మంజూరు, భూమిలేని రైతులకు మూడు ఎకరాల భూమి కేటాయింపు వంటి అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలు, చిన్నారులు, పేద విద్యార్థులపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రభుత్వాలు, అధికారులు మౌనం వీడాలని ప్రశ్నించారు. ప్రజాసంఘాలు ప్రజలకు అండగా నిలబడి వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించే దిశగా ఉద్యమాలు కొనసాగిస్తున్నాయని వక్తలు పేర్కొన్నారు. 2018లో స్థాపించబడిన ఈ సమితి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుని తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి వ్యవస్థాపక అధ్యక్షులు మన్నెపాకుల మాధవను సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, జిల్లా ఇన్‌చార్జ్ సాకే నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి అంజి, జిల్లా సహాయ కార్యదర్శి నరసింహులు, జిల్లా గౌరవ అధ్యక్షులు అశోక్ రెడ్డి, నగర గౌరవ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, నగర అధ్యక్షులు జగదీష్ నాయుడు, నగర ప్రధాన కార్యదర్శి కరీం భాషా, మైనార్టీ ఇన్‌చార్జ్ బాబా తదితరులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ జన సంఘం అధ్యక్షులు దాసిగానిపల్లి కుల్లాయప్ప, భారత జై భీమ్ సేన్ సంఘం అధ్యక్షులు రామాంజనేయులు, బీసీ సంఘం అధ్యక్షులు ఆదినారాయణ, సేవాలాల్ సేవా సమితి నాయకులు, ఫైట్ ఫర్ రైట్స్ అధ్యక్షులు కేపీ రాజు, బీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు, ఐఎంఎం, ఎంఎండీ ఆర్గనైజేషన్ ప్రతినిధులు సహా పలువురు ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

See also  RDT ఫెర్రర్‌ కుటుంబాన్ని కలిసిన MSSS సంఘం నాయకులు