
– చర్మకారుల జీవన వాస్తవాలను తెలుసుకున్న బీజేపీ నాయకులు-
‘సబ్ కా సాత్ – సబ్ కా వికాస్’ నినాదంతో చివరి వ్యక్తి అభివృద్ధే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం – ఎస్సీ మోర్చా నేతలు
అనంతపురము పిబ్రవరి 02, జనస్వరం : భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సంత్ గురు రవిదాస్ గారి వారోత్సవాల్లో భాగంగా అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ సమీపంలో చర్మకారులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సామాజిక సమానత్వం, వృత్తి గౌరవం, అణగారిన వర్గాల సాధికారత అనే అంశాలను కేంద్రబిందువుగా చేసుకుని సాగింది. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌరవ శ్రీ సంధి రెడ్డి శ్రీనివాసులు అన్నగారు ముఖ్య అతిథిగా హాజరై, చర్మకారులను ప్రత్యక్షంగా కలుసుకుని వారి జీవన పరిస్థితులు, కష్టనష్టాలను వారి మాటల్లోనే తెలుసుకున్నారు. వృత్తి ఆధారంగా జీవించే కుటుంబాల సమస్యలను గమనించి, వాటి పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ పథకాలను మరింత సమర్థంగా చేరవేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సంధి రెడ్డి శ్రీనివాసులు మాట్లాడుతూ, “ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చిట్టచివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు అందించాలనే సంకల్పంతో ‘సబ్ కా సాత్ – సబ్ కా వికాస్’ నినాదాన్ని ఆచరణలోకి తీసుకొచ్చింది. అభివృద్ధి అనేది కొద్ది మందికే పరిమితం కాకుండా, ప్రతి వర్గానికి, ప్రతి వృత్తికి అందేలా విధానాలు అమలు చేస్తోంది” అని తెలిపారు.
చర్మకారుల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అనేక సబ్సిడీలు, రుణ పథకాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా కృషి చేస్తోందని వివరించారు. సంప్రదాయ వృత్తులకు ఆధునిక సాంకేతికతను జోడించి ఆర్థికంగా బలోపేతం చేయడమే మోదీ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సంత్ గురు రవిదాస్ గారి జీవితం, తత్వం గురించి చర్మకారులకు వివరిస్తూ, “సంత్ గురు రవిదాస్ ఒక గొప్ప సామాజిక చైతన్యాన్ని రగిలించిన మహోన్నత వ్యక్తి. 15వ శతాబ్దంలోనే ఆయన తన పద్యాలు, రచనల ద్వారా పండితులను, రాజులను సైతం ప్రభావితం చేశారు. మనిషిని మనిషిగా గుర్తించాలి అనే సమానత్వ సందేశాన్ని సమాజానికి అందించారు” అని అన్నారు.
దళిత కుటుంబంలో జన్మించి, చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగించినప్పటికీ, ఆధ్యాత్మికంగా, సామాజికంగా సమాజాన్ని మేల్కొలిపిన గొప్ప గురువుగా సంత్ రవిదాస్ నిలిచారని కొనియాడారు. అలాంటి మహనీయుడిని స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సంత్ రవిదాస్ వారోత్సవాల్లో భాగంగా చర్మకారులను శాలువాలతో సత్కరించి, ఒక జత కొత్త బట్టలను బహుకరించారు. అలాగే సంత్ గురు రవిదాస్ గారి చిత్రపటాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం చర్మకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని, వృత్తి పట్ల గౌరవాన్ని పెంచేలా సాగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. శాంత కుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర మీడియా ఇంచార్జ్ పి. రామాంజనేయ ప్రసాద్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు జే. మలోబులు శివ మాట్లాడుతూ, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత వర్గాల కోసం అనేక సంస్కరణలు, రుణాలు, సంక్షేమ పథకాలు అమలు చేసి సముచిత న్యాయం కల్పిస్తోందని తెలిపారు.
ప్రధాని మోదీ తన తొలి సంవత్సరంలోనే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి మహాపరిణిర్వాణ దినోత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించి, దళిత మహానుభావుల ఆలోచనలను దేశానికి పరిచయం చేశారని గుర్తు చేశారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంత్ గురు రవిదాస్ గారి జయంతోత్సవాలను వారం రోజులపాటు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని నేతలు తెలిపారు. ఆయన రచనలు, పద్యాలు ప్రతి ఇంటికి చేరేలా కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. ఆ పిలుపులో భాగంగానే అనంతపురం పట్టణంలో చర్మకారుల సోదరులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించడం గర్వకారణం అని పేర్కొన్నారు. చర్మకారుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ,
“మీకు ఎలాంటి ప్రభుత్వ సహాయ సహకారాలు కావాలన్నా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ముందుండి పనిచేస్తాం” అని నేతలు భరోసా ఇచ్చారు. రాబోయే కాలంలో వృత్తి అభివృద్ధి, ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేకంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా మహిళా నాయకురాలు జయలక్ష్మి, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు లాలెప్ప నాగేంద్ర,
యువ మోర్చా జిల్లా అధ్యక్షులు తేజేశ్వర్ రెడ్డి, బీజేపీ నాయకులు గణేష్, కృష్ణ,చెన్నయ్య తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.








